నర్సీపట్నం : గిరిజనులకు అన్యాయం చేస్తున్న రోలుగుంట తహసీల్దార్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని సీపీఐఎంఎల్ లిబరేషన్ నాయకులు కె.జనార్దన్ డిమాండ్ చేశారు. సీపీఐఎంఎల్ లబిరేషన్ ఆధ్వర్యంలో గిరిజనులు తహసీల్దార్ వైఖరిని నిరసిస్తూ బుధవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఏవో బి.వి.రమణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో కొండఅడ్డసారు గ్రామంలో ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఆదివాసీల భూములను కబ్జా చేయడానికి ఆర్.చంద్రశేఖరరావు ప్రయత్నించారన్నారు. రెవెన్యూ అధికారులు రద్దు చేసిన డిజిటల్ సైన్‌ను యథావిఽధిగా వన్‌బీలో నమోదు చేశారన్నారు. 2018లో జాయింట్ కలెక్టర్ స్వయంగా ఆ భూములను పరిశీలించి, అప్పటి ఆర్డీవో కోరాడ సూర్యారావును విచారణ నిమిత్తం ఆదేశించారన్నారు. విచారణ చేసిన ఆర్డీవో రాయవరపు చంద్రశేఖరరావుకు ఆ భూములపై ఎటువంటి హక్కులు లేవని, డిజిటల్ సైన్ రద్దు చేశారన్నారు. నర్సీపట్నం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆర్.చంద్రశేఖరరావు అపీల్ చేశారు. తప్పుడు డాక్యుమెంట్స్ కేసును కోర్టు డిస్మిస్ చేసిందన్నారు. యలమంచిలి తహసీల్దార్ నుంచి చంద్రశేఖరరావు వారసత్వ ధృవపత్రం తీసుకురావడం జరిగిందన్నారు. తహసీల్దార్‌ను సంప్రదించగా తన సంతకం ఫోర్జరీ చేసి తయారు చేశారని నర్సీపట్నం ఏఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ వద్ద ఆర్‌ఓఆర్ అపీల్ నడుస్తుండగా, చంద్రశేఖరరావు పేరున తహసీల్దార్ వన్‌బీ నమోదు చేశారన్నారు. జిల్లాలో గిరిజన గ్రామాల్లో ఘర్షణలు, గొడవలకు ప్రధాన కారణం రెవెన్యూ అధికారులే అన్నారు. ఒకరి భూముల్ని మరొకరి పేరుతో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయడం వల్ల ఘర్షణలు జరుగుతున్నాయన్నారు.


