నాతవరం : అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీ స్పీకరు సిహెచ్.అయ్యన్నపాత్రుడు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. నాతవరం గ్రామంలో మంగళవారం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు.
వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో...
అనకాపల్లి: నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఆశయ సాధనకు నేటి యువత కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్, మాజీ ఎంపీ బీవీ సత్యవతి పిలుపునిచ్చారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రింగ్‌రోడ్డులోని పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రసాద్, భరత్‌కుమార్, సత్యవతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు గ్రామీణ స్థాయి నుంచి పండగ వాతావరణంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. 76 సంవత్సరాల భారత స్వాతంత్య్రంలో అన్ని వర్గాల ప్రజలు రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో ఆచరించడం జరుగుతుందన్నారు.
ఎస్పీ కార్యాలయంలో..
ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు మేరకు స్థానిక ఎస్పీ కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఏఎస్పీ ఎల్.మోహనరావు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ ఒక వర్గానికి చెందిన మహానీయుడు కాదని, అన్నివర్గాలకు రాజ్యాంగాన్ని రచించారన్నారు. కుల, మత లింగ విభేదాలు లేని సమానత్వ సమాజం కోసం ఆయన రూపొందిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనదన్నారు. మహిళలకు విద్యా హక్కులు, వెనుకడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ టి.లక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


