మా దారి అడ్డదారి... | - | Sakshi
Sakshi News home page

మా దారి అడ్డదారి...

Apr 15 2026 7:38 AM | Updated on Apr 15 2026 7:38 AM

చింతపాకలో పచ్చనేతల బరితెగింపు

పంచాయతీలో పూర్వపు రోడ్లు మూసివేత

గ్రామస్తులకు అవస్థలు

టీడీపీ నాయకులకు అనుకూలంగా మరో రోడ్డు నిర్మాణం

పట్టించుకోని అధికారులు

బుచ్చెయ్యపేట : మండలంలో గల చింతపాక గ్రామంలో టీడీపీ నాయకులు బరి తెగించారు. అధికారం ఉందన్న సాకుతో గతంలో ప్రభుత్వ నిధులతో వేసిన పంచాయతీ రోడ్లను మూసివేస్తున్నారు. పలువురు గ్రామస్తులకు రహదారి సౌకర్యం లేకుండా చేస్తున్నారు. 20 ఏళ్ల కిందట 14 అడుగుల వెడల్పుతో వేసిన రెండు సిమెంట్‌ రోడ్లపై రాకపోకలు సాగకుండా మూసివేశారు. తెలకలవారి వీధికి వేసిన సిమెంట్‌ రోడ్డుపై నుంచి ఎవరూ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా మట్టి వేసి మూసేశారు. గ్రామానికి చెందిన బంటుపల్లి నానాజీ ఇంటి వద్ద నుంచి కోట్ని లోవరాజు ఇంటి వరకు ఉన్న సిమెంట్‌ రోడ్డు, గొలగాని శేషు ఇంటి వద్ద నుంచి మంచినీటి బోరు వరకు ఉన్న మరో రోడ్డును మూసివేశారు. రహదారి సౌకర్యం లేకుండా చేశారని మాజీ ఉప సర్పంచ్‌ గద్దె అర్జున గ్రామస్తులు బంటుపల్లి నానాజీ, సకురు రమణ, పెదమ్మలు, సలాది జగ్గారావు, కండేపల్లి అప్పారావు, ఎల్లేటి మాధవి ఆరోపిస్తున్నారు. ఒక టీడీపీ నాయకుడి ఇంటి కోసం ఉన్న పాత రోడ్లను మూసేసి పంచాయతీ స్థలాలు ఆక్రమించి మరో చోట నుంచి సిమెంట్‌ రోడ్డు వేసి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అందరికి ఉపయోగపడే 14 అడుగుల రోడ్డు మూసివేసి టీడీపీ నాయకుడికి అనుకూలంగా 8 అడుగుల రోడ్డు వేస్తున్నారని ఆరోపించారు. 14 అడుగుల పెద్ద రోడ్డు మూసి వేయడంతో ట్రాక్టర్లు, వ్యాన్‌లు ఇతర వాహనాలు తిరగకుండా చేస్తున్నారన్నారు. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఇసుక, పిక్క, రాయి, ఇటుకలు ఎలా తెచ్చుకోవాలని, ఇరుకు రోడ్డు వల్ల ట్రాఫిక్‌ జామ్‌ అయి ప్రమాదాలు సంభవిస్తాయని గ్రామస్తులు మండిపడుతున్నారు. దీనిపై పంచాయతీ, మండల అధికారులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement