మాకవరపాలెం : ముఖ ఆధారిత హాజరుతో ఇబ్బందులు పడుతున్నామని ఉపాధిహామీ శ్రామికులు డ్వామా పీడీ నిర్మలాదేవి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని కొండలఅగ్రహారం ఎర్రచెరువులో జరుగుతున్న పూడిక తొలగింపు పనులను ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రామికుల హాజరు వివరాలను తనిఖీ చేశారు. అనంతరం శ్రామికులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకోగా శ్రామికులు తమ ఆవేదనను తెలియజేశారు. ఉపాధి సిబ్బంది తెలిపినట్టుగా ఉదయం 5 గంటలకే పనిప్రదేశానికి హాజరవుతున్నామన్నారు. కానీ ముఖ ఆధారిత హాజరు నమోదులో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందన్నారు. కొందరి హాజరు నమోదు కాకపోవడంతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీనిపై పీడీ మాట్లాడుతూ త్వరలో ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉదయం 5 గంటలకు పనులు ప్రారంభించి, 10 గంటలకు ముగించాలని సూచించారు. పని ప్రదేశంలో నీడకు టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి, నర్సీపట్నం ఏపీడీలు యరకయ్య, చిన్నారావు, ఏపీవో కాశీ పాల్గొన్నారు.


