నర్సీపట్నం: స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ తొత్తుగా వ్యవహరిస్తున్నారని, వైఎస్సార్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసు కట్టారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాఽశంకర్ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఆదేశాలతో తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యేతో కలిసి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు మంగళవారం నర్సీపట్నం రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత భూమిలో చెట్లు నరుక్కుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణమన్నారు. అదే స్పీకర్ అయ్యన్నపాత్రుడు నడిరోడ్డుపై డప్పు కళాకారుడైన దళితుడిని చెంప చెల్లుమనిపిస్తే, ఇదే పోలీసులు పేక్షకపాత్ర వహించారని ఆగ్రహించారు. తమ పార్టీ నాయకుడు సన్యాసిపాత్రుడు తన సొంత భూమిలో తోట నరికిస్తుంటే పోలీసులు అడ్డగించడమే కాకుండా అక్రమ కేసు పెట్టారన్నారు. సన్యాసిపాత్రుడు కుటుంబ సభ్యులు ఈరెల్లి రాజుబాబుకు భూమిని లీజుకు ఇస్తూ అగ్రిమెంట్ చేశారన్నారు. లీజు అగ్రిమెంట్ 2024 నాటికి ముగిసిందన్నారు. అగ్రిమెంట్ అయిపోయి రెండేళ్లు అవుతుంటే ఈరెల్లి రాజుబాబుకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. స్పీకర్ వాటాకు సంబంధించిన తోటను మట్టుకోకుండా సన్యాసిపాత్రుడు, మరో ఇద్దరు అన్నదమ్ముల వాటాలోని తోటను నరుకుతుంటే సీఐ అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. ఈ ఘటనలో తమ పార్టీ నాయకుడు లాలం స్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వేధిస్తున్నారన్నారు. రాజుబాబు మరో వ్యక్తి దాసుకు లీజుకు ఇవ్వటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దాసు సర్వేకర్ల వ్యాపారం చేయటం ఎప్పుడైనా చూశారా? అని టీడీపీ నాయకులను ప్రశ్నించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి రోజున రూరల్ సీఐ తప్పుడు కేసు బనాయించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. స్పీకర్ పట్ల సీఐ రేవతమ్మ స్వామిభక్తి ప్రదర్శిస్తూ, తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. ఇదే సాంప్రదాయాన్ని భవిష్యత్తులో ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న ట్రాక్టర్లను తక్షణమే విడిచి పెట్టాలన్నారు. తమ నాయకుడి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే సీఐ చర్యలకు వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొర, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ, చింతకాయల వరుణ్, దాడి బుజ్జి, సుర్ల నాయుడు తదితరులు పాల్గొన్నారు.


