గొలుగొండ/నాతవరం : గ్రామాల్లో గంజాయి అక్రమ రవాణా, రౌడీయిజం చేసే వ్యక్తులను వెంటనే గుర్తించి తాటతీయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. గొలుగొండ మండలంలో కృష్ణదేవిపేట, గొలుగొండ గ్రామాల్లో నూతనంగా నిర్మాణం చేసిన రెండు పోలీస్ స్టేషన్లు, నాతవరంలో పోలీస్‌స్టేషన్ నూతన భవనాలను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రారంభోత్సవం చేశారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, రౌడీయిజం అరికట్టే విధంగా ప్రజలను భాగస్వాములు చేసి అనేక కార్యక్రమాలు పోలీస్‌శాఖ చేపడుతోందన్నారు. నాతవరం ఎస్సీ కాలనీలో నిర్మించిన సోలార్ ప్లాంటును స్పీకర్, ఎస్పీలతో కలిసి హోంమంత్రి అనిత ప్రారంభించారు. అంబేడ్కర్ జయంతి రోజున ఎస్సీ కాలనీలో రాయితీపై ఏర్పాటు చేసిన విద్యుత్ సోలార్ ప్లాంటును, నాతవరం, గొలుగొండ మండలాల్లో రూ.7.50 కోట్లతో నిర్మించిన 3 పోలీసుస్టేషన్లకు నూతన భవనాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.


