వేటకు విరామం | - | Sakshi
Sakshi News home page

వేటకు విరామం

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేటకు బ్రేక్‌ జూన్‌ 14 వరకు 61 రోజుల పాటు క్రాప్‌ హాలిడే జిల్లాలో 6 మండలాల్లో 31 మత్స్యకార గ్రామాలు వేటపై ఆధారపడి జీవిస్తున్న 12,644 మంది మత్స్యకారులు పరోక్షంగా 50 వేల కుటుంబాలు గతేడాది సకాలంలో మత్స్యకార భరోసా అందక ఇబ్బందులు

వేట విరామం ప్రకటించడంతో ఒడ్డున లంగరు వేసిన బోట్లు

సాక్షి, అనకాపల్లి: సముద్ర జలాలపై సాగించే చేపల వేటకు విరామం లభించింది. గంగపుత్రులు రెండు నెలల పాటు తమ వలలకు విశ్రాంతి ప్రకటించనున్నారు. మత్స్యసంపద పెరిగే కాలం కావడంతో 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చేపల వేట సాగించే మత్స్యకారులు నిషేధ కాలంలో ఇంటి పట్టునే ఉండనున్నారు. ప్రతి ఏటా మే 14 – జూన్‌15 సమయంలో సముద్రంలో చేపల సంతానోత్పత్తికి ఎటువంటి విఘాతం కలిగించరాదనే వేటనిషేధం ప్రకటిస్తారు. ఈ విరామ సమయంలో వలలను అల్లుకోవడం, బోట్లకు మరమ్మతులు చేసుకోవడం వంటి పనులు మత్స్యకారుల చేసుకుంటారు.

జిల్లాలో ఉన్న 73 కిలోమీటర్ల తీరంలో 14వ తేదీ అర్ధరాత్రి నుంచి వేట నిషేధం అమలులోకి రాన్నుది. దీంతో రెండు నెలల పాటు ఎక్కడ బోట్లు అక్కడే ఉండిపోతాయి. ఈనెల 15వ తేదీ నుంచి రెండు నెలల పాటు 61 రోజుల పాటు వేటను ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి విదితమే. మళ్లీ జూన్‌ 15వ తేదీ నుంచి చేపల వేట మొదలవుతుంది. దీంతో వీరికి ప్రభుత్వం మత్స్య భరోసా కింద ఆర్థిక సహాయం ఈ ఏడాదైనా అర్హులైన వారందరికీ ఇవ్వాలని మత్స్యకారులు కోరుతున్నారు. జిల్లా పరిధిలో 73 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరంలో ఆరు మండలాల పరిధిలోని 31 మత్స్యగ్రామాల్లో 12,644 మత్స్య కుటుంబాలకు మత్స్యవేటే జీవనాధారం.

ఈ ఏడాదైనా భృతి కల్పించేనా..!

ఎన్నికలకు ముందు అబద్ధపు హామీలతో మత్స్యకారుల ఓట్లను తమవైపు మలుచుకుని గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణమే ఏడాది పాటు వేట నిషేధం భృతి ఎగ్గొట్టారు. పోనీ రెండో ఏడాదిలోనైనా ఇస్తారని ఆశిస్తే..అర్హులైన మత్స్యకారులకు ఇవ్వకుండా అనర్హులకు వేట నిషేధకాల భృతి కల్పించి అవకతవకలకు పాల్పడ్డారు. అర్హతలేనటువంటి కూటమి పార్టీల అనుకూల మత్స్యకారులకు నిషేధ భృతి కల్పించారు. దీంతో వేట మీదే ఆధారపడి జీవించే మత్స్యకారులకు అన్యాయం జరిగింది. 2022–23 ఏడాదిలో లబ్ధిపొందిన మత్స్యకారుల్లో అర్హత ఉన్న సుమారు 2 వేల మందికి మత్స్యకార భరోసా అందలేదు. ఒక్కోబోటులో అర్హతలేనటువంటి కూటమి పార్టీల అనుకూల మత్స్యకారలుకు భరోసా కల్పించారు. వేట మీదే ఆధారపడి జీవించే గిరిపుత్రులకు వేట నిషేధ భృతి కల్పించకుండా అన్యాయం చేశారు. దీనిపై జిల్లా మత్స్యకార అధికారికి, జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంగానే మారింది. ఈ ఏడాదైనా ప్రభుత్వం నుంచి అందే భరోసా అర్హులైన మత్సకారులకు అందించాలని మత్స్యకార సంఘాల నాయకులు కోరుతున్నారు.

వేట భృతి కోసం 12,644 మత్స్య కుటుంబాలు

అనకాపల్లి జిల్లా పరిధిలో 73 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరంలో ఉన్న ఆరు మండలాల పరిధిలోని 31 మత్స్యగ్రామాలు ఉన్నాయి. 12,644 మత్స్య కుటుంబాలు కేవలం చేపల వేట, విక్రయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మత్స్యకారులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో గత ప్రభుత్వం ఆంధ్రా ఫిష్‌ వంటి కార్యక్రమాలను అమల్లోకి తీసుకొచ్చింది. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల భృతి కోసం 2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం పెంచింది. 2014 టీడీపీ ప్రభుత్వంలో అరకొరగా ఉండే మత్స్యకార భరోసాను రూ.10 వేలకు పెంచడంతో అప్పట్లో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే 2024 ఎన్నికలు మత్స్యకారులకు ఎన్నికల నిబంధనలు శరాఘాతంగా మారాయి.

నిషేధ భృతి...తీరిదీ..

2022–23– ఏడాదిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో 11,500 మంది మత్స్యకారులకు నిషేధ భృతి అందించారు.

2023–24లో చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకార భరోసా ఇవ్వలేదు.

2024–25 లో జిల్లాలో నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్‌.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ మండలాల్లో 11,544 మందికి గానూ రూ.23.28 కోట్లు భృతి అందించారు.

వీరు కాకుండా అర్హత ఉన్న మత్స్యకారులు సుమారుగా 1500 మందికి వేట నిషేధ భృతి రాలేదు. వీరిలో అచ్యుతాపురం మండలంలో 400 మంది మత్స్యకారులు, రాంబిల్లి, పరవాడ మండల పరిధిలో 200 మంది, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల పరిధిలో 400 మందికి పైగా మత్స్యకారులకు నిషేధ భృతి అందించలేదు.

అదేవిధంగా విద్యుత్‌ బిల్లులు ఎక్కువగా వచ్చాయని, ఫోర్‌ వీలర్స్‌ ఉన్నాయని, భూమి లేకపోయినా ఉన్నట్టు సూచిస్తూ టెక్నికల్‌ సమస్యలతో సుమారుగా 500 మంది మత్స్యకారులకు నిషేధ భృతి అందించలేదు.

17 నుంచి ఎన్యూమరేషన్‌..

జిల్లాలో తీరప్రాంతం : 73 కి.మీ.

మత్స్యకార గ్రామాలు : 6 మండలాల్లో 31 గ్రామాలు

మత్స్యవేటపై ఆధారపడిన వారు మొత్తం : 12644

మోటారైజ్డ్‌ బోట్లపై వేట సాగించేవారు : 11643

నాన్‌ మోటారైజ్డ్‌ బోట్లపై వేట చేసేవారు : 1001

మత్స్యకారుల వెతలు వినపడవా..?

చంద్రబాబు ప్రభుత్వానికి మత్స్యకారుల ఓట్లే కావాలి..వారి సమస్యలు, వెతలు వినపడవు. వేట నిషేధం మొదటి ఏడాది ఎగ్గొట్టింది. రెండో ఏడాదిలో జిల్లాలో సుమారుగా 1500 వేల మంది అందలేదు. డీజిల్‌ సబ్సిడీ పూర్తి స్థాయిలో రాలేదు. పాయకరావుపేటలో పెట్రోల్‌ బంక్‌ సబ్సిడీ ఇవ్వలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏనాడూ మా మత్స్యకార భరోసా ఆగలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ భరోసా అందింది. అదేవిధంగా అర్హత ఉన్న వారందరికీ ఈ ఏడాదైనా భరోసా ఇవ్వాలని కోరుతున్నాను.

– చోడిపల్లి శ్రీనివాసరావు,

మాజీ మత్స్యకార కార్పొరేషన్‌ డైరెక్టర్‌

ఈ ఏడాదైనా అర్హులైనవారికి భృతి ఇవ్వాలి..

విరామానికి ముందే వేట నిషేధ భృతి ప్రకటిస్తే బావుండేది. రిజిస్ట్రేషన్‌ అయిన ప్రతి బోట్‌కి నిషేధ భృతి ఇవ్వాలి. గతేడాది వేటకు వెళ్లని మత్స్యకారులకు నిషేధ భృతి ఇచ్చారు. స్థానిక సచివాలయ ఉద్యోగులు, కూటమి నాయకులు భాగస్వామ్యంతోనే అవకతవకలకు పాల్పడ్డారు. అర్హులైన వారికి ఇవ్వలేదు. ఈ ఏడాది అలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రభుత్వం అర్హులైన మత్స్యకారులకు భృతి అందించాలి.

– వాసుపల్లి శ్రీనువాసరావు,

మత్స్యకార నాయకుడు, పూడిమడక

నక్కపల్లి: ఈ ఏడాది వేట నిషేధ పరిహారం కోసం ఏప్రిల్‌ 17 నుంచి సర్వే చేపట్టనున్నారు. పరిహారం కోసం ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు విధించింది. ఏప్రిల్‌ 14 నాటికి లైసెన్స్‌ రెన్యూవల్‌ అయి ఉండాలి. సర్వే సమయంలో బోటు యజమానితో పాటు, కలాసీలంతా హాజరు కావాలి. వేట చేసే బోటుకు జరిమానా విధించి ఉండకూడదు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ భరోసా వర్తిస్తుంది. 18 నుంచి 60 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. లబ్ధిదారులు సామాజిక భద్రతా పింఛను తీసుకుంటే ఈ పథకం వర్తించదు. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. మోటరైజ్డ్‌ బోటులో 6 మంది, సంప్రదాయ పడవలో ముగ్గురు మాత్రమే వేటసాగిస్తూ ఉండాలి. ఏప్రిల్‌ 17న సర్వే బృందాలు మత్స్యకార గ్రామాల్లో పడవలను తనిఖీ చేస్తాయి. 19 నుంచి 22 వరకు సేకరించిన డేటాను ఆన్‌లైన్‌ చేస్తారు. 23న సచివాయాల్లో అర్హత పొందిన లబ్ధిదారుల జాబితా ప్రదర్శిస్తారు. 23నుంచి 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 27న కలెక్టర్‌ ఆమోదానికి పంపిస్తారు. 30 నుంచి డీబీటీ విధానంలో ఆర్థిక సాయం పంపిణీ చేయడం జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement