● మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
● బలిఘట్టం శివాలయంలో ప్రత్యేక పూజలు
నర్సీపట్నం: రైతుల మేలు కోరినవారైతే..సృష్టి క్షేత్రాన్ని నర్సీపట్నం పెద్ద చెరువులో కాకుండా బలిఘట్టం శ్రీబ్రహ్మలింగేశ్వరస్వామి వేంచేసి ఉన్న పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కూటమి నేతలకు సూచించారు. పార్టీ నాయకులతో కలిసి బలిఘట్టం బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్రగా బయలుదేరి ఉత్తరవాహిని నదిలో పుజాపత్రిని కలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సృష్టిక్షేత్రం పేరుతో 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని పెద్దచెరువులో ఏర్పాటు చేయడం వల్ల ఆయకట్టు రైతులకు నష్టం జరుగుతుందన్నారు. రైతుల అభిప్రాయాన్ని గౌరవించి శివపార్వతుల విగ్రహాన్ని బలిఘట్టం పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అధ్యాతికంగానే కాకుండా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం ఒకటి అన్నారు. ఇక్కడ శివలింగాన్ని సాక్షాత్తూ బ్రహ్మదేవుడు ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయన్నారు. సాధారణంగా నదులు తూర్పునకు ప్రవహిస్తాయి. ఇక్కడ వరహానది పశ్చిమ దిశగా ప్రవహించడం వల్ల దక్షిణకాశీగా పిలువబడుతుందన్నారు. స్వామి వారి ఆలయంతో పాటు లక్ష్మీదేవి, శనేశ్వర ఆలయాలు, సత్యనారాయణస్వామి ఆలయం, పాకలపాడు గురుదేవుల ఆశ్రమం ఉందన్నారు. అందువల్ల రైతులకు నష్టం వాటిల్లకుండా బలిఘట్టం పుణ్యక్షేత్రంలో 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూటమి నేతలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పెట్ల అప్పలనాయుడు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్‌చైర్మన్‌లు తమరాన అప్పలనాయుడు, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత, టౌన్ పార్టీ అధ్యక్షులు ఏకా శివ, నాలుగు మండలాల మండల పార్టీ అధ్యక్షులు శానపతి వెంకటరత్నం, పాణిశాంతరాం, చిటికెల రమణ, నాగేశ్వరరావు, ఎంపీపీలు గజ్జలపు మణికుమారి, రుత్త సర్వం, మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు సుర్ల నాయుడు,నాతవరం మండలం యూత్ ప్రెసిడెంట్ బండారు నాయుడు, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల అధ్యక్షులు సుర్ల చంద్రశేఖర్, కై న్సిలర్లు సిరసపల్లి నాని, జగదీశ్వరి,మాకిరెడ్డి బుల్లిదొర, పట్టణ మహిళా అధ్యక్షురాలు కణితి అన్నపూర్ణ,పట్టణ యూత్ అధ్యక్షులు అల్లంపల్లి ఈశ్వరరావు, మాజీ స్టేట్ డైరెక్టర్లు కర్రి శ్రీనువాసరావు, షేక్ ఉన్నీషా బేగం, ఏఎంసీ మాజీ డైరెక్టర్ లోకవరపుశారద, పార్టీ నాయకులు బొడ్డు గోవిందరావు, పెట్ల భద్రాచలం పాల్గొన్నారు.


