నర్సీపట్నం: పొలిటికల్ సమావేశానికి రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించి..అధికారులు రాకుండా తమ సమయాన్ని వృఽథా చేయడమే కాకుండా అవమానించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల సుబ్బన్న, జనసేన నాయకులు అద్దెపల్లి గణేష్, రాజా, ఆమ్‌ఆద్‌మీ పార్టీ జిల్లా కన్వీనర్ కొణతాల హరినాథ్, బీజేపీ నాయకులు బోళెం శివ, బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు చిందాడ నూకేశ్వరరావు, ఆ పార్టీ పల్లా రమణ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం నిర్వహించాల్సిన సమావేశానికి తమను ఆహ్వానించారన్నారు. ఆర్డీవో రాకపోయినా ఆ స్థాయి అధికారి కానీ నాలుగు మండలాల తహసీల్దార్లు సైతం హాజరు కాలేదన్నారు. సుమారు రెండు గంటలకు పైగా కార్యాలయం వద్ద వేచి ఉన్నప్పటికీ ఎవరూ రాలేదన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆర్డీవో వి.వి.రమణ దృష్టికి తీసుకువెళ్లగా అనివార్య కారణాల వల్ల సమావేశం పెట్టలేకపోయామని, మరో రోజు ఏర్పాటు చేస్తామని ఆర్డీవో తెలిపారు.


