ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

అచ్యుతాపురం రూరల్‌: ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అచ్యుతాపురం తహసీల్దార్‌ డి. శ్రీను హెచ్చరించారు. సోమవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘చెరువు స్థలంపై కబ్జాదారుల కన్ను’ అనే శీర్షికపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన స్పందించారు. అచ్యుతాపురం ఇందిరమ్మ కాలనీకి ఆనుకున్న చెరువు గర్భంలో అక్రమ నిర్మాణం చేపడుతున్న స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ చెరువు స్థలంలో భారీ భవంతి నిర్మాణానికి తీసిన గోతులను పొక్లెయిన్‌తో కప్పేసి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించారు. అనంతరం వీఆర్వో, ఆర్‌ఐ, సర్వేయర్లను ఉద్దేశించి మాట్లాడుతూ మరోసారి ప్రభుత్వ భూముల్లో ఎవరైనా కబ్జాలకు పాల్పడితే షోకాజ్‌ నోటీసులు ఇస్తామన్నారు. గతంలో ఇక్కడ స్థలంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలగించి భవంతి నిర్మాణానికి పూనుకుంటున్న వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ తెలిపారు. చెరువు గర్భం ఆక్రమణపై స్థానిక యువకులు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావడం అభినందనీయమన్నారు.

చెరువు స్థలం దగ్గర హెచ్చరిక బోర్డు ఏర్పాటు

Advertisement
 
Advertisement
Advertisement