ఆత్మీయ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాదరావు
సబ్బవరం: వైఎస్సార్ సీపీ హయాంలో ఎస్సీ వర్గాల సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాదరావు అన్నారు. మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విభాగం జిల్లా అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్‌రాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బొడ్డేడ మాట్లాడుతూ గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్య, ఉపాధి, గృహ, ఆరోగ్య రంగాల్లో ఎస్సీ వర్గాలకు విశేష ప్రాధాన్యత కల్పించామన్నారు. నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో పార్టీ కమిటీలను త్వరితగతిన పూర్తిచేయాలని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అన్యాయం, దాడులను పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్, పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి ఐడి బాబు, అనకాపల్లి జిల్లా ఎస్సీ విభాగం పరిశీలకుడు అల్లంపల్లి రాజుబాబు, ఉత్తరాంధ్ర రీజనల్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు జానకిరామ్, విశాఖ జిల్లా ఎస్సీ విభాగం పరిశీలకులు పూర్ణచంద్ర, వేచలపు ప్రకాష్, ఈర్లి సుధీర్ కుమార్ జ్ఞాన్ దీప్ పాల్గొన్నారు.


