మరో ఇద్దరికి గాయాలు
అనకాపల్లి : అనకాపల్లి–సబ్బవరం హైవేపై రేబాక జంక్షన్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన మైనింగ్ లారీ ఢీకొనడంతో పాటు బొలెరో డ్రైవర్ నాగరాజు(33)ను కొంత దూరం పాటు ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలో నిల్చొని ఉన్న మరో ముగ్గురు యువకులను కూడా లారీ ఢీకొంది. వీరిలో ఒకరు స్వల్పంగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు, బాధితుల కుటుంబ సభ్యులు రోడ్డుపై టెంటు వేసి ఆందోళన చేశారు. మైనింగ్ లారీల దూకుడుకు అడ్డుకట్టవేయాలని డిమాండ్ చేశారు. భరోసా ఇచ్చేంతవరకు మృతదేహాన్ని తీసేది లేదంటూ పట్టుబట్టారు. మృతుడు నాగరాజు సబ్బవరం మండలం నారపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంలో అనకాపల్లి మండలం కాపుశెట్టివానిపాలెం గ్రామానికి చెందిన కరణం శేషాద్రి, కరణం తేజ, కరణం బాలాజీలు గాయపడ్డారు. అనకాపల్లి రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.


