● ఖాళీ సిలిండర్లతో తప్పని పడిగాపులు
● డీలర్లు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని
వినియోగదారుల ఆరోపణ
నర్సీపట్నం: వంటగ్యాస్ దొరక్క వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా సర్వర్ బిజీ వస్తోంది. గతంలో గ్యాస్ బుక్ చేస్తే 2 నుంచి 3 రోజుల్లో సిలిండరు డెలివరీ అయ్యేది. ప్రస్తుతం 20 రోజులు అవుతున్నా డెలివరీ ఇవ్వడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. ప్రధానంగా హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుతో వినియోగదారులు ఖాళీ బండలు పట్టుకుని గ్యాస్ కోసం రోడ్డు ఎక్కుతున్నారు. శనివారం రెండు లారీలతో సిలిండర్లు వచ్చినా కొందరికే గ్యాస్ లభించింది. చాలా మంది ఖాళీ సిలిండర్లతో సీబీఎం కాపౌండ్ మెయిన్‌రోడ్డుపై బారులు తీరారు. గ్యాస్ దొరక్క నిరాశతో వెనుదిరిగారు. గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తున్న బాయ్‌లు ఒక్కో సిలిండర్‌ను రూ.2 వేలుకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, ఇదంతా ఏజెన్సీ నిర్వాహకుల కనుసన్నల్లోనే జరుగుతుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఏజెన్సీ నిర్వాహకులు తప్పుడు లెక్కలతో అధికారులను సైతం బురిడీ కొట్టిస్తున్నారని చెబున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బుచ్చెయ్యపేట: గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో గ్యాస్ బుక్ చేసుకున్న రెండు మూడు రోజుల్లోనే సిలిండర్ ఇంటికి వచ్చేది. ప్రస్తుతం బుక్ చేసిన 40 రోజుల వరకు గ్యాస్ అందని పరిస్థితి ఏర్పడింది. సింగిల్ సిలిండర్ ఉన్న వారు ఎప్పుడు గ్యాస్ అయిపోతుందో, ఎప్పుడు బుక్ చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. శనివారం వడ్డాదిలో వందలాది మంది గ్యాస్ కోసం మండుటెండలో గంటల తరబడి వేచి ఉండవలసి వచ్చింది. ఈ నెల 19 వరకు బుక్ చేసుకున్న వారికి మాత్రమే గ్యాస్ ఇవ్వగా 20వ తేదీ తరువాత బుక్ చేసుకున్న వారికి గ్యాస్ ఇవ్వకపోవడంతో పలువురు వెనుదిరిగారు.


