నర్సీపట్నం: ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో దళితుల భూసమస్యలపై అర్జీలు వెల్లువెత్తాయి. తాండవ నిర్వాసితులకు కోటవురట్ల మండలం పందూరు గ్రామంలో ఇచ్చిన భూములను అగ్రవర్ణాల వారు అక్రమించారని గొలుగొండ మండలం జోగంపేట గ్రామానికి చెందిన దళితులు కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకువెళ్లారు.మా భూములను మాకు అప్పగించాలని వారు కోరారు. 1.78 సెంట్ల భూమిని వేరే కులం వారు అక్రమించి భూమిలోకి రానివ్వటం లేదని, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని గొలుగొండ మండలం కశిమి గ్రామానికి చెందిన వేమగిరి సింహాచలం అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఎకరా 81 సెంట్లు భూమి వివరాలను రికార్డుల్లో తొలగించి అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి పేరు నమోదు చేశారని ఆమె మొరపెట్టుకుంది. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డీహెచ్‌పీఎస్ జిల్లా నాయకులు డొక్కా రాజుబాబు కమిషన్ సభ్యులు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యలను పరిష్కరించి, నివేదిక ఇవ్వాలని సభ్యులు ఆర్డీవో వి.వి.రమణకు సూచించారు. దళితుల భూములకు రక్షణ కల్పించడమే కమిషన్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య, దళిత నాయకులు చిట్ల చలపతిరావు, సహాదేవుడు తదితరులు పాల్గొన్నారు.


