డాబాగార్డెన్స్(విశాఖ): జనగణన (2027) ప్రక్రియను ఫీల్డ్ ట్రైనర్లు బాధ్యతాయుతంగా నిర్వహించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి ఆదేశించారు. మద్దిలపాలెంలోని డాక్టర్ వీఎస్ కృష్ణా ప్రభుత్వ కళాశాలలో మంగళవారం సెన్సస్–2027 ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. దేశంలో తొలిసారిగా జనగణనను డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నందున, డేటా నమోదులో ఎటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని వివరించారు. తొలి దశలో 2026 మే 1 నుంచి మే 30 వరకు ఇళ్ల జాబితా, గృహ గణన ప్రక్రియ జరుగుతుందన్నారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా లెక్కల సేకరణ కొనసాగుతుందని వివరించారు. సుమారు 16 ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఆర్వో శేష శైలజ మాట్లాడుతూ.. జనగణన అనేది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదని, ఇది ఒక చట్టబద్ధమైన విధి అని గుర్తుచేశారు. దేశాభివృద్ధికి, భవిష్యత్తు ప్రణాళికల రచనకు ఈ గణాంకాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నందున, అన్ని వివరాలను పారదర్శకంగా, కచ్చితత్వంతో సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో సెన్సస్ జాయింట్ డైరెక్టర్ దయాసాగర్, కళాశాల ప్రిన్సిపాల్ విజయబాబు, మాస్టర్ ట్రైనర్ జి.నాగార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.


