నక్కపల్లి: రాష్ట్రానికి మిట్టల్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదేనని పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు తెలిపారు. దీన్ని తన ఖాతాలో వేసుకుంటూ డప్పా కొట్టుకుంటున్న చంద్రబాబును మించిన క్రెడిట్ చోర్ ఘనుడు లేరన్నారు. మంగళవారం అడ్డురోడ్డులో విలేకరుల సమావేశంలో జోగులు మాట్లాడుతూ 2022లో దావోస్ పర్యటనలో నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని మిట్టల్ గ్రూపు ఇండియా సీఈవో ఆదిత్య మిట్టల్ కలిసి రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఎంవోయూ కుదుర్చుకున్నారన్నారు.
ఈ విషయం అప్పట్లో పలు జాతీయ ప్రసార మాధ్యమాల్లో వచ్చిందన్నారు. దీన్ని కప్పిపుచ్చుతూ స్టీల్ ప్లాంట్ ఘనత తమ ప్రభుత్వానిదేనని కూటమి నాయకులు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భూములను సేకరించి నిర్వాసితులను, రైతులను అనాథలుగా వదిలేశారన్నారు. 2013 భూసేకరణ చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్వాసితులు ఆందోళన చేస్తే, కేవలం రూ.9 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. మిట్టల్ కంపెనీ వారు స్టీల్ ప్లాంట్ పెడుతుంటే టీడీపీ వాళ్లు నానా హడావిడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడ చంద్రబాబు కుటుంబం కంపెనీ పెడుతున్నట్లుగా హంగామా చేశారని ఎద్దేవా చేశారు. మిట్టల్ సోమ్ముతో జల్సాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి జనాలను తరలించేందుకు వందలాది ఆర్టీసీ బస్సులను ఉపయోగించడం దారుణమన్నారు. దాంతో పదో తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరి ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా ఉందన్నారు. భూములు త్యాగం చేసిన నిర్వాసితులను భూమిపూజ కార్యక్రమానికి ఆహ్వానించకుండా ఘోరంగా అవమానించారని ఆరోపించారు. బహిరంగ సభ కేవలం టీడీపీ ప్రచార సభగా మార్చేశారన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు వీవీఐపీ పాసులు ఇచ్చుకుని వారితోనే సభ మమ అనిపించారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను సైతం స్టేజ్‌పైకి ఆహ్వానించకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించడం దారుణమన్నారు. అనంతరం నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమానర్‌ను ఘనంగా సన్మానించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, దత్తుడు సీతబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శీరం నర్సింహమూర్తి, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, ఎంపీపీ పార్వతి తాతారావు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి సూరాకాసుల గోవిందు, జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా, వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, పాయకరావుపేట మండలాధ్యక్షుడు గెడ్డమూరి శ్రీనివాస్, మండల మాజీ అధ్యక్షుడు పొడగట్ల పాపారావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సుందర లత, ఎస్. రాయవరం మండల శాఖ అధ్యక్షుడు మధువర్మ, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు వంగలపూడి రామారావు, ఎస్సీ విభాగం అధ్యక్షుడు కాకర వెంకటరావు, యువజన విభాగం అధ్యక్షుడు పోచిన నాగేశ్వరరావు, పాయకరావుపేట ఉప సర్పంచ్ జగతా భవానీ శ్రీనివాస్, నూకినాయుడు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


