నాతవరం : గుడ్ గవర్నెర్స్ విభాగంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలకు ఎంపికై న శృంగవరం పంచాయతీలో సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర కమిటీ బృందం పర్యటించింది., బృందం సభ్యులైన డాక్టర్ జావీద్‌నబీ, డి.ఊపేంద్రకుమార్, ఓఎస్‌డీ శ్రీనాఽఽథ్ శృంగవరం గ్రామానికి రావడంతో జిల్లా స్థాయి అధికారులతో పాటు వైఎస్సార్‌సీీపీ నాయకులు సర్పంచ్ ఉలబాల యర్రయ్యమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు కాళ్ల పార్వతి ఘనంగా స్వాగతం పలికారు. కమిటీ బృందం గ్రామ సచివాలయంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేదలకు సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు తీరు, విధి విధానాలపై చర్చించారు. పంచాయతీ పాలకవర్గ సమావేశాల నిర్వహణ, తీర్మానాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్ సేవలకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న స్పందన గురించి తెలుసుకున్నారు. గ్రామంలో కలియతిరిగి లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడారు. సచివాలయాలు, పాఠశాల, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్‌లను సందర్శించి సేవల తీరును తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి పథకాల నిర్వహణ, ఇంటింటి కుళాయిలు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. గ్రామంలో తడి చెత్త పోడి చెత్త సేకరణ , చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో సేంద్రియ ఎరువులు తయారీ, పారిశుధ్య పనులను పరిశీలించారు. డ్వాక్రా సంఘాల పనితీరు, ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పంచాయతీ జాతీయ అవార్డుకు ఎంపికై తే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా పంచాయతీకి కోటి రూపాయలు నిధులు వస్తాయన్నారు. పంచాయతీ సర్పంచ్ ఉలబాల యర్రయ్యమ్మ, పంచాయతీ కార్యదర్శి వాసం శ్రీనివాసరావుకు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఘన సత్కారంతో పాటు అవార్డు ప్రదానం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో పి,నారాయణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి సందీప్ డీడీవో ఇ.నాగలక్ష్మి, మండల ప్రత్యేకాధికారి జి.మంగవేణి, ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో కె.మూర్తిబాబు, ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు మండల స్థాయి అఽధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


