అర్జీలు పునరావృతమైతే మీదే బాధ్యత | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పునరావృతమైతే మీదే బాధ్యత

Mar 10 2026 7:27 AM | Updated on Mar 10 2026 7:27 AM

● ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలి ● అధికారులకు కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ ఆదేశం ● పీజీఆర్‌ఎస్‌కు 290 అర్జీలు

తుమ్మపాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, పునరావృతం కాకుండా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలు వేర్వేరుగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారుల సమస్యలను కలెక్టర్‌తోపాటు జేసీ శౌర్యమాన్‌ పటేల్‌, ఇతర జిల్లా అధికారులు వింటూ అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేసి శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాస్థాయి అధికారులు తప్పకుండా అర్జీదారులతో మాట్లాడి, సమస్య పూర్వాపరాలు తెలుసుకొని సరైన పరిష్కారం చూపాలన్నారు. అందువల్ల అర్జీలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. పునరావృతం అయ్యిందంటే జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వివిధ సమస్యలపై 131 అర్జీలు అందగా, రెవెన్యూ క్లినిక్‌కు 159 వినతులు మొత్తంగా 290 అర్జీలు నమోదయ్యాయి. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

నిషేధిత 22(ఎ) జాబితాలో తొలగించాలని నిరసన

నిషేధిత 22(ఎ) జాబితాలో తప్పుగా నమోదైన ప్లాట్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 7 ప్రకారం తక్షణమే తొలగించి న్యాయం చేయాలంటూ అనకాపల్లి మండలం గొలగాం గ్రామంలో సమృద్ధి వెంచర్స్‌లో ప్లాట్‌ల కొనుగోలుదారులు కలెక్టరేట్‌ గేటు వద్ద నిరసన తెలిపారు. సర్వే నెం.137/3లో వుడా అనుమతితో నిర్మించిన వెంచర్‌లో 2012లో ప్లాట్‌లు రిజిస్ట్రేషన్‌ ద్వారా కొనుగోలు చేశామని, తదుపరి 22(ఎ) జాబితాలో తప్పుగా నమోదు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా ఉందని, ఇప్పుడైన స్పందించి న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.

రికార్డులు ట్యాంపరింగ్‌ చేసి భూవిక్రయాలు

వంద ఎకరాల ఆయకట్టు కలిగిన 13 ఎకరాల పాత్రుని చెరువుతోపాటు కోడూరు, రేబాక గ్రామాల మధ్య 23 ఎకరాల ప్రైవేటు భూముల రికార్డులను ట్యాంపరింగ్‌ చేసి క్రయవిక్రయాలతో కోట్ల రూపాయలు దోచేసిన మాజీ సర్పంచ్‌ మామిడి చిన్నారావుపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని అనకాపల్లి మండలం కాపుశెట్టివానిపాలెంకు చెందిన గనిరెడ్డి రమణబాబు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఏడేళ్ల క్రితం చెరువు రికార్డులు మార్చేసిన మాజీ సర్పంచ్‌ ఇప్పుడు దాని రూపురేఖలు మార్చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు దృష్టి సారించి చెరువుతో రైతుల భూములను కాపాడాలని కోరారు.

ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ విజయ కృష్ణన్‌

నిషేధిత జాబితా నుంచి రిజిస్టర్డ్‌ ప్లాట్‌లను తొలగించాలంటూ బాధితుల నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement