ఉద్యమకారులపై కేసులు తగవు
నక్కపల్లి: బల్క్ డ్రగ్‌పార్క్‌కు వ్యతిరేకంగా రాజయ్యపేటలో జరుగుతున్న ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న మత్య్సకార నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తుపాను సాయం కోసం పంచాయతీ కార్యదర్శిపై దౌర్జన్యం చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గ్రామానికి చెందిన పిక్కి తాతీలు, పిక్కి కోటి, రామచరణ్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. వీరిపై ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సమంజసం కాదన్నారు. బల్క్‌డ్రగ్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, ఉద్యమకారులను భయభ్రాంతులకు గురి చేసేందుకే అట్రాసిటీ కేసుల పేరుతో అరెస్టులు చేస్తున్నారన్నారు.
పారా లీగల్ వలంటీర్లకు ఇంటర్వ్యూలు
నర్సీపట్నం: మండల్ లీగల్ సర్వీస్ కమిటీ పారా లీగల్ వలంటీర్ల నియామకానికి శుక్రవారం కోర్టు సముదాయంలో సీనియర్ సివిల్ జడ్జి పి.షీయాజ్ ఖాన్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న 25 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరందరినీ ఎంపిక చేసినట్టు జడ్జి ప్రకటించారు. ఈ ఇంటర్వ్యూలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మెట్టా ప్రభాకర్‌రావు ఉన్నారు.
అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
అనకాపల్లి టౌన్ : మండలంలోని జాతీయ రహరారి కోడూరు జంక్షన్ వద్ద అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. యలమంచిలి జయబాబు పలు గ్రామాలలో సేకరించిన 12 బస్తాల్లోని 600 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.


