గురుకులాల్లో పార్ట్ టైం లెక్చరర్స్ తొలగింపు అన్యాయం
స్వేరో నెట్‌వర్క్ రాష్ట్ర కన్వీనర్ చిట్టియ్య
నర్సీపట్నం: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో పని చేస్తున్న పార్ట్‌టైం ఉపాధ్యాయులను ప్రభుత్వం అకారణంగా తొలగించడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ స్వేరో నెట్‌వర్క్ రాష్ట్ర కన్వీనర్ ఎం.చిట్టియ్య పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా వెట్టిచాకిరి చేయించుకుని తొలగించడం దారుణమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరలోచన చేయాలని డిమాండ్ చేశారు. పేద వర్గాల పిల్లలు చదువుకుంటున్న ఈ గురుకులాల్లో కనీస బోధన సదుపాయాలు కల్పించడానికి పార్ట్‌టైం పేరిట చాలీచాలని జీతాలు చెల్లిస్తూ ఒకేసారి ఉద్యోగాల నుంచి తొలగించడం గురుకుల ఉన్నతాధికారులకు తగదన్నారు. ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీతో పారదర్శక పాలన అందిస్తున్నామని చెబుతుంటే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల సొసైటీలో కనీసం తొలగిస్తున్నామన్న విషయాన్ని తెలపకుండా ఉపాధ్యాయులను రోడ్డున పడేయడం మంచిపద్ధతి కాదన్నారు. గురుకుల అధికారులు నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేని 72 కాలేజీలలో సీనియారిటీ కలిగిన లెక్చరర్స్‌ని ఇన్‌చార్జిలుగా నియమించి వారి స్థానంలో ఆయా సబ్జెక్టులు బోధించేందుకు పార్ట్ టైం లెక్చరర్స్‌ని నియమించారన్నారు. కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న వీరందరినీ తొలగించారన్నారు. వీరికి రావాల్సిన మూడు నెలల జీతాలను సైతం ఇవ్వకుండా కళాశాల నుండి గెంటేసారన్నారు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా తక్కువ జీతాలతో పని చేసిన పార్ట్ టైం ఉపాధ్యాయులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో అదుకోవాలన్నారు.


