ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే..!
● కేజిహెచ్‌లో జనరేటర్లు ఏర్పాటు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం
● వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్
అనురాధ ధ్వజం
దేవరాపల్లి : పేద ప్రజల ప్రాణాల పట్ల కూటమి ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, విశాఖ కేజిహెచ్‌లో విద్యుత్ సమస్యతో రోగులు పడ్డ ఇబ్బందుల పట్ల వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ అన్నారు. దేవరాపల్లి మండలం తారువలో శుక్రవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కేజిహెచ్‌లో అత్యవసర వైద్య సేవలందించే రాజేంద్ర ప్రసాద్, భవన్‌నగర్, చిన్న పిల్లల వార్డు, గైనిక్ వార్డులలో గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, ఇతర రోగులు నరకయాతన అనుభవించారన్నారు. ఈ సమస్యపై కూటమి ప్రజాప్రతినిధులు సహా కూత వేటు దూరంలో ఉన్న జిల్లా కలెక్టర్ సైతం కేజిహెచ్‌ను సందర్శించి సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడం దారుణమన్నారు. వేలా ది మందికి వైద్య సేవలందించే ఆసుపత్రిలో కనీసం జనరేటర్లు ఏర్పాటు చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ఆమె విమర్శించారు. వందేళ్ల చరిత్ర కలిగిన కేజిహెచ్‌లో గతంలో ఎన్నడూ ఇలాంటి దారుణ ఘటన జరగలేదని, ఇది ముమ్మాటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమేనని అన్నారు. పవర్‌కట్‌తో ఆక్సిజన్ అందక మహిళ ప్రాణాలు కోల్పోయారని, దీనికి ఎవరూ బాధ్యత వహిస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎక్కడ ప్రమాదాలు జరిగినా కూటమి ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను విస్మరించి ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేయడం అలవాటుగా మారిందని, ఇలాంటివి మానుకోవాలని అనురాధ హితవు పలికారు.


