చీకట్లు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
స్పందించని కేజీహెచ్ అధికారులు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిర్లక్ష్యం
వార్డుల్లో రోగుల అవస్థలు
కేజీహెచ్‌లో
అధికారుల నిర్లక్ష్యం.. రోగులకు శాపం
మహారాణిపేట : ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య సంజీవని కేజీహెచ్‌లో గురువారం రాత్రి చీకట్లు కమ్ముకున్నాయి. ఎటుచూసినా అంధకారం అలముకుంది. పలు వార్డుల్లో రోగులు, సిబ్బంది చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా ఈ దుస్థితి దాపురించింది. యూజీ కేబుల్ కట్ అయ్యి.. సరఫరా నిలిచిపోయినా కేజీహెచ్ అధికారులు రాత్రి వరకు గంటల వరకూ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకుండా వదిలేశారు.
ఏమైందంటే?
గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మార్చురీ సమీపంలో ఓ భవన నిర్మాణ పనులు చేపట్టారు. అక్కడ భూగర్భ కేబుల్ ఉందనే హెచ్చరికలు ఉన్నా.. కాంట్రాక్టర్ పట్టించుకోలేదు. నిర్మాణ పనులు చేస్తున్న వారినీ హెచ్చరించలేదు. ఫలితంగా యూజీ కేబుల్ విద్యుత్ వైర్లు కట్ అయ్యాయి. ఈ కేబుల్ తెగిపోవడంతో సబ్ స్టేషన్‌కు వెళ్లే లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు వార్డులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రాత్రి వరకు స్పందన లేదు !
మధ్యాహ్నం సరఫరా నిలిచిపోయినా అధికారులు సత్వరమే స్పందించకపోవడంతో అర్ధరాత్రి వరకూ అవస్థలు పడాల్సి వచ్చింది. సాయంత్రం సమయంలో ఈపీడీసీఎల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పునరుద్ధరణ పనులు చేపట్టడం ప్రారంభించారు. సాధారణంగా యూజీ కేబుల్ వెళ్లిన మార్గంలో ఏవైనా తవ్వకాలతో కూడిన పనులు జరిగినప్పుడు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. కానీ కేజీహెచ్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా రోగుల ఆరోగ్య భద్రతను గాలికొదిలేశారు.
జనరేటర్లు పనిచేయడం లేదు?
కేజీహెచ్‌లో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు విద్యుత్ సరఫరా కోసం భారీ సామర్థ్యం ఉన్న జనరేటర్లున్నాయి. కానీ గత కొద్ది నెలలుగా ఈ జనరేటర్లు పనిచేయడం లేదు. ఇటీవల మోంథా తుఫాన్ సందర్భంగా ఉన్నతాధికారులు తనిఖీలు చేసిన సమయంలో జనరేటర్లను త్వరితగతిన సరిచేయాలని ఆదేశించారు. అయినా సదరు జనరేటర్ కాంట్రాక్టర్‌పై కనీస చర్యలు తీసుకోలేదు సరికదా.. వాటిని బాగుచేయమని కూడా కేజీహెచ్ అధికారులు ఆదేశించకపోవడం గమనార్హం. ఆ రోజే ప్రభుత్వం మేల్కొని జనరేటర్లను బాగుచేసి ఉంటే.. ఈ రోజున ఈ దుస్థితి వచ్చేది కాదని కేజీహెచ్ వర్గాలు చెబుతున్నాయి. జనరేటర్ల పనితీరుపై ఆరోపణలు వస్తున్నా.. ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కారణంగానే యూజీ కేబుల్ కట్ అయి.. సరఫరా నిలిచిపోయినా ప్రత్యామ్నాయం చూడలేకపోయారు. కనీసం అద్దైకె నా జనరేటర్ తెచ్చి రోగులకు ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఆలోచన రాకపోవడం విడ్డూరం. అర్ధరాత్రి వరకూ కేజీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర నాయుడు, ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్‌ఈ శ్యామ్ బాబు పర్యవేక్షణలో మరమ్మతులు చేపట్టారు.
చీకట్లు
చీకట్లు


