లారీ ఢీకొని రైతు దుర్మరణం
యలమంచిలి రూరల్: యలమంచిలి పట్టణానికి సమీపంలో కొక్కిరాపల్లి హైవే కూడలి వద్ద గురువారం రోడ్డు క్రాస్ చేస్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో రైతు మృతి చెందాడు.ఎస్ రాయవరం మండలం సర్వసిద్దికి చెందిన అడబాల సాయిరాం(59), అతని అల్లుడు దాసరి గోవింద్‌తో కలిసి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి ద్విచక్రవాహనంపై యలమంచిలి మీదుగా అనకాపల్లి వెళ్తున్నారు. కొక్కిరాపల్లి హైవే కూడలి వద్ద సర్వీసు రోడ్డు నుంచి 16వ నంబరు జాతీయ రహదారికి వీరు ప్రయాణిస్తున్న బైక్ రోడ్డు దాటుతున్న సమయంలో తుని నుంచి అనకాపల్లి వైపునకు వెళ్తున్న ఏపీ27వి 7265 రిజిస్ట్రేషన్ నంబరు కలిగిన లారీ, ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్ బోల్తా పడి వెనుక కూర్చున్న అడబాల సాయిరాం రోడ్డుపై పడ్డాడు. అతని శరీరంపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్ర రక్తగాయాలైన సాయిరాం ప్రమాదస్థలంలోనే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న మృతుడి అల్లుడు దాసరి గణేష్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. దాసరి గణేష్ ఈ ప్రాంతంలో ఆర్‌ఎంపీగా సేవలందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర అక్కడకు చేరుకుని ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. డ్రైవర్ అధిక వేగంతో నిర్లక్ష్యంగా లారీని నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. సాయిరాం మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు. కాగా కొక్కిరాపల్లి హైవే కూడలి ప్రాంతంలో ఇటీవల కాలంలో ప్రమాదాలు పెరుగుతున్నాయన్న ఆందోళన వాహనచోదకుల్లో నెలకొంది.


