
మత్స్యకారులకు బాసటగా..
నక్కపల్లి: జిల్లాలోని ఒక చిన్న బెస్త గ్రామంలో మొదలైన ఉద్యమం దేశంలోని మత్స్యకారులందరినీ ఏకం చేస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్‌పై వ్యతిరేకత రోజురోజుకూ రాజుకుంటోంది. 38 రోజుల నుంచి రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు పెరుగుతోంది. ఒక్క రాజయ్యపేట గ్రామస్తులు మాత్రమే బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తున్నారని, మిగిలిన గ్రామాల మత్స్యకారులు అనుకూలంగానే ఉన్నారని టీడీపీ నాయకులు, కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొడుతూ నియోజకవర్గంలో తీరప్రాంతాన్ని అనుకుని ఉన్న మత్స్యకార గ్రామాల వారంతా ఈ ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటయితే ఒక్క రాజయ్యపేటకు మాత్రమే నష్టం వాటిల్లదని, ఎస్.రాయవరం మండలం బంగారయ్యపాలెం నుంచి పాయకరావుపేట మండలం పెంటకోట వరకు తూర్పుతీరాన్ని అనుకుని ఉన్న 18 మత్స్యకార గ్రామాలకు నష్టం వాటిల్లుతుందని, పదుల సంఖ్యలో ఏర్పాటయ్యే రసాయన పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలు సముద్రంలో కలిసి మత్స్యసంపద నాశనమై సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల ఉపాధికి తీవ్రవిఘాతం కలుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి రేవుపోలవరం, పెదతీనార్ల, చినతీనార్ల, దొండవాక, బోయపాడు, బంగారయ్యపేట, పెంటకోట గ్రామాలకు చెందిన మత్స్యకారులు సమావేశమై ఆయా గ్రామాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఒడిశాలోని పూరి, కోణార్క్‌లలో మత్స్యకారులు సముద్రపు ఒడ్డున ప్రత్యేకంగా గంగమ్మతల్లికి, నూకతాతకు పూజలు చేశారు. వీడియో సందేశాలను రాజయ్యపేట మత్స్యకారులకు పంపించారు.
వాట్సాప్ సందేశాల ద్వారా మద్దతు
తామంతా రాజయ్యపేట వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నప్పటికీ తమను రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని, రాజయ్యపేట వెళ్లే అన్ని మార్గాల్లోను చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారంటూ వివిధ గ్రామాల మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తాము కూడా ఉద్యమంలో పొల్గొంటామంటూ రాజయ్యపేట మత్స్యకారులకు వాట్సాప్ సందేఽశాలను పంపిస్తున్నారు. చినతీనార్లలో మత్స్యకార మహిళలు స్థానికంగా కొబ్బరి తోటల్లోకి పనుల కోసం వెళుతూ.. బల్క్ డ్రగ్ వద్దు, మత్స్యకారులే ముద్దు, రాజయ్యపేట మత్స్యకారులకు తామంతా సంఘీభావం తెలుపుతున్నామంటూ నినాదాలు చేశారు. ఎన్నాళ్లు పోలీసులను కాపలా పెడతారో చూస్తాం అంటూ పలువురు దొండవాక మత్స్యకారులు చెబుతున్నారు. బంగారయ్యపేట, రేవుపోలవరం, పెంటకోట గ్రామాలకు చెందిన మత్స్యకారులు కూడా తమ తమ గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వాట్సాప్ ద్వారా సందేశాలు, తమ నిరసనలను తెలియజేశారు.
పండుగనాడూ పోరాటమే..
బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా రాజయ్యపేట మత్స్యకారులు చేపట్టిన నిరాహారదీక్ష మంగళవారానికి 38వ రోజుకు చేరుకుంది. దీపావళి పండుగను సైతం మానుకుని మత్స్యకారులంతా నిరాహారదీక్ష కొనసాగించారు. ప్రాణాలకు ముప్పు కలిగించే బల్క్ డ్రగ్ పరిశ్రమలను ప్రాణాలొడ్డయినా సరే అడ్డుకుని తీరాలన్న పట్టుదలతో మత్స్యకారులు ఉన్నారు.
మత్స్యకారులమా.. టెర్రరిస్టులమా.. మాపై ఎందుకంత కక్ష..?
డ్రోన్ కెమెరాలు.. మఫ్టీలో పోలీసులు.. ఇంటిలిజెన్స్, ఎస్‌బి విభాగం వారి నిఘాతో రాజయ్యపేట భారత దేశంలో అంతర్భాగమేనా అనే సందేహం కలుగుతోందని రాజయ్యపేట మత్స్యకారులు వాపోతున్నారు. గ్రామస్తుల్లో కొంతమందిని మచ్చిక చేసుకొని, ఆందోళనకారుల వ్యూహమేమిటి? ఎవరెవరు మద్దతిస్తున్నారు?.. తదితర విషయాలను కూపీ లాగుతున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని, తమను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్నారని మత్స్యకారులు వాపోతున్నారు. వంగలపూడి అనిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పెరుగుతున్న మద్దతు
పూరి, కోణార్క్‌లలో గంగమ్మతల్లి, నూకతాతలకు పూజలు
ఐక్యమవుతున్న మత్స్యకారులు

మత్స్యకారులకు బాసటగా..

మత్స్యకారులకు బాసటగా..