ఆరిపోయిన ఆశల దీపాలు
గాజువాక/కూర్మన్నపాలెం: దీపావళి రోజున విషాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి పాత గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ఉపాధి కోసం వలస వచ్చిన రెండు నిరుపేద కుటుంబాల ఆశలను ఛిద్రం చేసింది. వారి ఇళ్లలో చీకట్లను నింపింది. కుటుంబానికి ఆసరా అవుతారనుకున్న కుమారులు.. వారిని శోకసంద్రంలో ముంచి.. అనంత వాయువుల్లో కలిసిపోయారు. ఇదే ఘటనలో మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి..
కూర్మన్నపాలెం ప్రాంతంలో నివాసం ఉంటున్న మారేడుపల్లి అజయ్ కుమార్ (18), వెందుర్తి మనోజ్ కుమార్ (17), కె.మధు(17) ముగ్గురూ స్నేహితులు. సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంపై నగరంలోని ఆర్‌కే బీచ్‌కు వెళ్లేందుకు బయలుదేరారు. అజయ్ బైక్ నడుపుతుండగా, మనోజ్, మధు వెనుక కూర్చున్నారు. సరిగ్గా పాతగాజువాక జంక్షన్‌కు వచ్చేసరికి వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ముగ్గురూ తుళ్లిపోయి రోడ్డుపై పడిపోయారు. ఇది గమనించిన సమీపంలోని ఆటో డ్రైవర్లు వెంటనే స్పందించి, వారిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అజయ్ కుమార్, మనోజ్ కుమార్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన మధును మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించిన గాజువాక ట్రాఫిక్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వలస కుటుంబాల్లో తీరని వేదన
ఈ ప్రమాదం ఉపాధి కోసం సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చిన రెండు నిరుపేద కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. మృతుడు అజయ్ కుమార్ స్వస్థలం చీడికాడ మండలం వరహాపురం గ్రామం. అతని తండ్రి అర్జున్ ఇటీవల కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవడంతో, తల్లి లోవలక్ష్మితో కలిసి 87వ వార్డు కాశీపాలెంలో ఒక అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. తల్లి కష్టాన్ని చూసిన అజయ్ ఐటీఐ చదువుతూనే, మరోవైపు కోళ్ల వ్యానులో పనిచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నాడు. తన చెల్లి ఐశ్వర్యను ఇంటర్ చదివిస్తున్నాడు. కొడుకు ప్రయోజకుడై తమ కష్టాలు తీరుస్తాడనుకున్న ఆ తల్లికి.. అజయ్ మరణం తీరని పుత్రశోకాన్ని మిగిల్చింది. మరో మృతుడు వెందుర్తి మనోజ్ కుమార్ కుటుంబానిది కూడా ఇలాంటి దీన గాథే. ఏడేళ్ల కిందట విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బోనంగి నుంచి ఉపాధి కోసం నగరానికి వలస వచ్చారు. అతని తల్లిదండ్రులు ముత్యాలు, దేముడమ్మ.. కూర్మన్నపాలెం 86వ వార్డు అశోకనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. మనోజ్ కుమార్ ఐటీఐ మధ్యలో ఆపేసినట్టు పోలీసులు తెలిపారు. మనోజ్‌కు కూడా ఒక చెల్లి ఉంది. కొడుకు మరణవార్త విని తల్లి దేముడమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. గంటల ముందు తమ కళ్లెదుట దీపావళి సంబరాల్లో పాల్గొన్న పిల్లలు.. ఒక్కసారిగా విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి రోదనలతో కూర్మన్నపాలెం ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆరిపోయిన ఆశల దీపాలు
ఆరిపోయిన ఆశల దీపాలు
ఆరిపోయిన ఆశల దీపాలు


