యాదవ నేతపై దుర్భాషలు
సామాజిక భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం రద్దు చేయాలని పల్లా లేఖ దీన్ని తప్పుబట్టిన యాదవ సామాజికవర్గ నేతలు వారిపై విరుచుకుపడినపల్లా అనుచరురాలు ఆమైపె ఎస్పీకి ఫిర్యాదు చేసిన తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కోన గురవయ్య
సాక్షి, అనకాపల్లి: తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కోన గురవయ్యపై గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బంధువు తిట్ల పురాణం హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో యాదవ సామాజిక భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు రాసిన లేఖను తప్పు పడుతూ యాదవ నేతలు ఘాటుగా స్పందించారు. దీంతో గురవయ్యకు ఫోన్ చేసి పల్లా శ్రీనివాసరావు బంధువు, మాజీ కౌన్సిలర్ పులిచర్ల రాజేశ్వరి విరుచుకుపడ్డారు. పత్రికల్లో రాయలేని భాషతో యాదవ నేత, ఆయన భార్యను దుర్భాషలాడుతూ.. భయపెట్టారు. దుర్భాషలాడిన పల్లా శ్రీనివాసరావు బంధువుపై గురవయ్య గురువారం అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హాకు, అనకాపల్లి టౌన్ సీఐకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర డీజీపీ హరిష్‌కుమార్ గుప్తాకు కూడా స్పీడ్ పోస్టు ద్వారా ఫిర్యాదు కాపీ పంపించారు.
వైఎస్ జగన్ మంజూరు చేసిన స్థలానికి పల్లా మోకాలడ్డు
అనంతరం అనకాపల్లి ఎస్పీ కార్యాలయం సమీపంలో మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి మేయర్ గొలగాని హరివెంకట కుమారి నేతృత్వంలో యాదవ సామాజిక భవన నిర్మాణం కోసం తామంతా స్థలం కావాలని నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరామన్నారు. యాదవ సామాజిక వర్గం అభివృద్ధి కోసం విశాఖలో ఎండాడ వద్ద 50 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తూ 2023 సెప్టెంబర్ 26న జీవో నెం.453 ఇచ్చారని తెలిపారు. ఆ జీవోను రద్దు చేయాలంటూ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారని, ఈ విషయమై తాను పల్లా శ్రీనివాసరావుతో ఫోన్ ద్వారా మాట్లాడేందుకు పలుమార్లు ప్రయత్నించినట్లు తెలిపారు. ఒకటి రెండుసార్లు నేరుగా మా యాదవ సామాజిక వర్గం పెద్దలతో ఆయనను కలవడానికి ప్రయత్నించినా ఉపయోగం లేకపోయిందన్నారు. దీనిపై విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో ఉన్న యాదవ సామాజిక వరా్గానికి చెందిన వారందరికీ తెలియజేసేందుకు తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా వాట్సప్ గ్రూపుల్లో ఈ విషయం పోస్టు చేసినట్లు పేర్కొన్నారు. పల్లా శ్రీనివాసరావు బంధువు పులిచర్ల రాజేశ్వరి ఈ నెల 22వ తేదీ రాత్రి ఫోన్ చేసి.. తనను, తన భార్యను బండ బూతులు తిడుతూ తన కుటుంబాన్ని పత్రికల్లో రాయలేని భాషలో దుర్భాషలాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ సంభాషణను రికార్డు చేసి పల్లా సూకరాజు అనే వ్యక్తి వాట్సప్ అకౌంటు ద్వారా మరలా అదే గ్రూపులో పోస్టు చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


