40వ రోజుకు చేరిన రాజయ్యపేట దీక్షలు
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా రాజయ్యపేట మత్స్యకారులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 40వ రోజుకు చేరుకుంది. గురువారం వర్షంలో కూడా నిరశన దీక్ష కొనసాగించారు. శుక్రవారం కలెక్టర్ రాజయ్యపేట రానున్న నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో మోహరించిన పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మత్స్యకారులతో సమావేశమయ్యేందుకు వీలుగా ప్రత్యేకంగా బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి వేదిక వద్దకు పంపించనున్నారు.
వేటకు విరామం.. ఆందోళనలో మమేకం
బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాల్సిందేనన్న ఒకే ఒక్క నినాదంతో మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. నలభై రోజుల నుంచి వేటకు విరామం ప్రకటించి ఉపాధి లేక పస్తులతోనే పోరాటం కొనసాగిస్తున్నారు. పదుల సంఖ్యలో ఏర్పాటు కాబోయే రసాయన పరిశ్రమల వల్ల ఈ ప్రాంతమంతా కలుషితమవుతుందని వారంతా భయాందోళనలు చెందుతున్నారు. రసాయన పరిశ్రమల వల్ల వెలువడే కాలుష్యంతో క్యాన్సర్, కిడ్నీ సమస్యలకు లోనై ఇప్పటికే గ్రామంలో సుమారు 30 మంది వరకు మృత్యువాత పడ్డారు. చాలామంది అనేక రుగ్మతలతో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బల్క్ డ్రగ్ పేరుతో ప్రభుత్వం గ్రామం చుట్టూ పదుల సంఖ్యలో రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిందని, పనులు కూడా ప్రారంభమయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు తీసుకునే ముందు కంపెనీల కోసమనే చెప్పారని, ఇటువంటి ప్రమాదకర మందుల కంపెనీలు ఏర్పాటు చేస్తామని చెప్పలేదని, అలా చెప్పి ఉంటే భూములు ఇచ్చేవాళ్లం కాదంటున్నారు. సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న తమను వేరొక ప్రాంతానికి తరలించినప్పటికీ అక్కడ బతకలేమని, తీరం వెంబడే నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటామని గంగపుత్రులు చెబుతున్నారు. శుక్రవారం కలెక్టర్ గ్రామంలోకి వస్తుండటంతో తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరిస్తారన్న ఆశాభావాన్ని మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నారు.
నేడు చర్చల కోసం కలెక్టర్ రాక


