పెరుగుతున్న ‘పెద్దేరు’
మాడుగుల రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పెద్దేరు జలాశయంలో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. గురువారం ఉదయం నుంచి జలాశయం పరిసరాల్లో కురుస్తున్న వర్షాల వల్ల జలాశయంలో నీటిమట్టం 136.50 మీటర్లకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా, కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి 380 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టాన్ని దృష్టిలో ఉంచుకొని గురువారం రాత్రి స్పిల్‌వే గేట్ల ద్వారా 350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని జలాశయం జేఈ సుధాకర్‌రెడ్డి తెలిపారు.


