జెడ్పీటీసీ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్
రోలుగుంట: కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు హత్య కేసుకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసి, గురువారం రిమాండ్‌కు తరలించినట్టు అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆమె తెలిపిన వివరాలివి. కొయ్యూరు జెడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజుకు రోలుగుంట మండలం ఎం.కె.పట్నం రెవెన్యూ పరిధిలో గల చటర్జీపురంలో 139 సర్వే నంబర్‌లో 10.83 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో తుప్పలు తొలగించి, సదరు భూమిని పరిశీలించడానికి కూలీలతో కలసి ఈ నెల 20వ తేదీన జెడ్పీటీసీ అక్కడకు వెళ్లారు. ఈ స్థలంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న కొన్ని కుటుంబాలతో జెడ్పీటీసీ నూకరాజుకు చిరకాల వైరం ఉంది. నూకరాజు వస్తున్న సమాచారం తెలుసుకొని, అతనితో విరోధం ఉన్న కేదారి రాజబాబు, అతని బంధువులు కాచుకొని ఉన్నారు. ఆ రోజు ఉదయం 11.30 గంటలకు పథకం ప్రకారం కత్తులు, కర్రలతో నూకరాజు, అతని అనుచరులపై దాడి చేశారు. మిగిలిన వారు భయభ్రాంతులకు గురై పారిపోగా, నూకరాజును చుట్టుముట్టి కత్తి, కర్రలతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన జెడ్పీటీసీ నూకరాజు అక్కడికక్కడే చనిపోయారు. ఇతనితో ఉన్న మాస లోవరాజుపైనా ప్రత్యర్థులు దాడి చేయగా అతని చేతికి గాయమైంది. సమాచారం తెలుసుకున్న వెంటనే కొత్తకోట సీఐ కోటేశ్వరరావు రోలుగుంట పోలీసులతో నేరస్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి ప్రధాన నిందితులుగా భావిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారించారు.
నేరం అంగీకరించిన నిందితులు
పథకం ప్రకారమే హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. నిందితులను ఈ నెల 22న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కొత్తకోట సీఐ కోటేశ్వర్రావు, రోలుగుంట ఎస్‌ఐ సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారిని గురువారం నర్సీపట్నం కోర్టులో రిమాండు నిమిత్తం ప్రవేశపెట్టడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిలో కేదారి రాజబాబు, నీలాపు అప్పలనాయుడు, నీలాపు లక్ష్మణరావు, నీలాపు అన్నలనాయుడు, నీలాపు యరకన్న, కేదారి రాజేశ్వరి, ఈదెల రాజేశ్వరి ఉన్నారన్నారు. ఈ సంఘటనను ప్రోత్సహించిన, సంబంధం ఉన్న వారి గురించి కూడా విచారణ చేస్తున్నామని, ఆరోపణలు రుజువైతే వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు. నూకరాజు, ప్రత్యర్థి వర్గాల పైన కూడా రెండు దఫాలు బైండోవరు కేసులు నమోదు చేశామన్నారు. జెడ్పీటీసీకి పూర్తి స్థాయిలో పోలీసులు రక్షణ కల్పించలేదన్న విమర్శలను డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా భూతగాదాలు సివిల్ సమస్య కిందకు వస్తాయన్నారు. అందుకు కోర్టు ఉత్తర్వులు గాని రెవెన్యూ ఉత్తర్వులు గాని, ఎస్పీ ఉత్తర్వులు గాని ఉండాలన్నారు. ఉన్నతాధికారుల అదేశాల మేరకు తమ శాఖ ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో పనిచేసిందని, దీనిలో భాగంగానే గతంలో రెండుసార్లు గొడవలను నియంత్రించడానికి బైండోవర్ కేసులు కూడా నమోదు చేశామని వివరించారు.


