డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో కాలం చెల్లిన వంట నూనె ప్యాకె
సీజ్ చేసిన జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్
అనకాపల్లి టౌన్: ఆహార భద్రత నిబంధనలు అమలు చేయని వ్యాపార సంస్ధలపై కేసులు నమోదు చేస్తామని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కె.సతీష్‌బాబు హెచ్చరించారు. వినియోగదారుల ఫిర్యాదు మేరకు గురువారం పట్టణంలోని ప్రముఖ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాలపరిమితి ముగిసిన వంట నూనె ప్యాకెట్లు, బిస్కెట్, చాక్లెట్స్ ప్యాకెట్లను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినియోగదారులు నిశితంగా పరిశీలించాకే ప్యాకేజ్డ్ ఆహార పదార్ధాలను కొనుగోలు చేయాలన్నారు. వ్యాపార సంస్ధలు వినియోగదారులకు ఇచ్చే ప్రతి రసీదు, ఇన్‌వాయిస్‌లలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్, రిజిస్టేషన్ నెంబర్‌లను స్పష్టంగా ముద్రించాలన్నారు. కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ, నిబంధనలు పాటించని సంస్ధలపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ పరిధిలోని నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1915కు, ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.


