ఒక విడత డీఏ జీవోను తక్షణం సవరించాలి
అనకాపల్లి: కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రకటించిన ఒక విడత డీఏ జీవోను తక్షణమే సవరించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ కోరారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు నేటి వరకూ నాలుగు డీఏలు బకాయిలు ఉండగా ఒక డీఏను మాత్రమే ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రభుత్వం 3.6 శాతం డీఏ ను మంజూరు చేస్తూ జీవో నంబర్ 60, 61లు విడుదల చేసిందని, ఈ జీవోలో డీఏ బకాయిలను ఉద్యోగి పదవీ విరమణ పొందిన తరువాత ఇస్తామని జీవోలు పేర్కొనడం దారుణమన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నేటి వరకూ పాలించిన ప్రభుత్వాలు ఈ రకమైన జీవోను జారీ చేయలేదన్నారు. ఉద్యోగులందరూ ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవోలను సవరించాలని కోరారు. 2023 జూలై నుంచి 12వ పీఆర్సీలు ఇవ్వవలసి ఉండగా, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పాలన జరుగుతున్నప్పటికీ పీఆర్సీ కమిషన్‌ను నియమించడకపోవడం శోచనీయమన్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన 12వ పీఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చి, గద్దెనెక్కిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు నేటికీ పీఆర్సీని ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. తక్షణమే పీఆర్సీ కమిషన్ నియమించి, 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఆయన కోరారు.


