యూరియా కోసం రైతుల కుమ్ములాట
ఎస్.రాయవరం: సైతారుపేట గ్రామంలో యూరియా కోసం రైతులు మంగళవారం కుమ్ములాడుకున్నారు. వ్యవసాయాధికారులు సాగు వేసిన రైతులకు అవసరం అయిన యూరియా సకాలంలో సరఫరా చేయకపోవడంతో ,సైతారుపేట రైతుసేవా కేంద్రానికి చేరిన యూరియా కోసం సైతారుపేట, పేటసూధిపురం రైతులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇరుగ్రామాలకు 130 చొప్పున బ్యాగులు రావడంతో వెనుక ఉన్నవారికి ఎరువు అందదన్న ఆందోళనతో తోపులాటకు దిగారు.ఈక్రమంలో పేటసూధిపురం కూటమి నాయకుడు తమ గ్రామ రైతులకు ముందుగా యూరియా ఇవ్వాలని గేటు వద్ద నిలుచుని రైతులను పంపారు. ఇది చూసి ఆగ్రహించిన రైతులు వచ్చిన ఎరువు అర్హులందరికీ పంపిణీ చేయాలని తోసుకోచ్చారు. ఇది గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆందోళన కారులను చెదరగొట్టి యూరియా పంపిణీని నిలిపివేశారు. అంతా సద్దుమణిగిన తరువాత సాయంత్రం రైతు సేవాకేంద్రం సిబ్బంది యూరియా పంపిణీ ప్రారంభించారు. అది తెలుసుకున్న రైతులు మరళా రైతు సేవా కేంద్రానికి పరుగులు తీశారు. సిబ్బంది కేవలం కూటమి నాయకులకు ప్రాధాన్యం ఇస్తూ పంపిణీ చేస్తున్నట్టు గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిని గదిలో ఉంచి తలుపులు వేశారు. అలా చొరవ తీసుకుని తులుపు మూసింది కూడా కూటమి నాయకులు మద్దతుదారులు కావడం విశేషం. దీంతో సిబ్బంది వెనుక డోర్ నుంచి నెమ్మదిగా అక్కడనుంచి జారుకున్నారు.
యూరియా స్లిప్పుల కోసం పడిగాపులు
కశింకోట: మండలంలోని నూతలగుంటపాలెం, కశింకోట గ్రామాల్లో యూరియా ఎరువు కోసం రైతులు గంటల తరబడి మంగళవారం నిరీక్షించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. నూతలగుంటపాలెంలో యూరియా ఎరువు కోసం స్లిప్పులు పొందడానికి అక్కడి రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బారులు తీరి సుమారు రెండు గంటలు పైగా నిరీక్షించారు. ఎరువు నిల్వ అందుబాటులో ఉన్న మేరకు 250 మందికి స్లిప్పులు ఇచ్చి సమీపంలోని నరసింగబిల్లి పీఎసీఎస్ గిడ్డంగి వద్దకు బుధవారం రావాలని వ్యవసాయ సహాయకుడు రాజా కోరారు. అలాగే ఇంకా 89 మంది రైతులు మిగిలి పోగా వారిని కశింకోటలోని ప్రైవేటు డీలర్ వద్ద యూరియా తీసుకోవడానికి అనువుగా స్లిప్పులు అందజేశారు. కశింకోటలోని ప్రైవేటు డీలర్ వద్ద రైతులు స్లిప్పుల కోసం సుమారు 3 గంటల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. స్లిప్పుల కోసం పేరు నమోదు చేసే మిషన్ పని చేయకపోవడంతో నిరీక్షణ తప్పలేదు.
యూరియా కోసం రైతుల కుమ్ములాట


