
రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం
జెడ్పీటీసీకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏమిటి: అమర్‌నాథ్
నర్సీపట్నం: రాష్ట్రంలో లా అండ్ అర్డర్ పూర్తిగా విఫలమైందని, దీనికి జెడ్పీటీసీ వారా నూకరాజు హత్యే నిదర్శనమని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. మంగళవారం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వచ్చి హత్యకు గురైన కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు మృతదేహానికి నివాళులర్పించారు. మృతుడు భార్య, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జెడ్పీటీసీ నూకరాజు హత్యను తాను రాజకీయం చేయదలుచుకోలేదన్నారు. భూ వివాదానికి సంబంధించి గతంలో జెడ్పీటీసీపై దాడి చేసి, గాయపరిచారన్నారు. నాలుగు పర్యాయాలు బైండోవర్ చేసినా హత్యకు గురికావటం బాధాకరమన్నారు. రెవెన్యూ, పోలీసులు సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తే ఇంత ఘోరం జరిగేది కాదన్నారు. ఏదైనా జరగరాని సంఘటన జరిగినప్పుడు.. ప్రజలు రోడ్ల మీదకు వచ్చినప్పుడు స్పందిస్తున్నారన్నారు. పరవాడలో బాలికపై హత్యాచారం, కందుకూరులో కారుతో గుద్దించిన సంఘటన శాంతిభద్రతలు విఫలమయ్యాయని చెప్పడానికి నిదర్శనాలన్నారు. హత్యతో ప్రమేయం ఉందని చెబుతున్న అజయ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పార్టీ నాయకులతో కలిసి ఏరియా ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత, తదితరులు ఉన్నారు.
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ముందు గిరిజన నేతల బైఠాయింపు
కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు హత్యకు గురైన విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అల్లూరి జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి చేరుకొని బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఏరియా ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించారు.
జెడ్పీటీసీ కుటుంబానికి న్యాయం చేయాలని, బాధితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. హత్యకు పోలీసులు బాధ్యత వహించాలన్నారు. జెడ్పీటీసీ నూకరాజు మృతదేహానికి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, మాజీ ఎంపీ మాధవి నివాళులర్పించారు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ జెడ్పీటీసీ నూకరాజుకు నివాళులర్పించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం