ఇంటి పన్నుల సొమ్ము స్వాహా | - | Sakshi
Sakshi News home page

ఇంటి పన్నుల సొమ్ము స్వాహా

Oct 15 2025 6:44 AM | Updated on Oct 15 2025 6:44 AM

ఇంటి పన్నుల సొమ్ము స్వాహా

ఇంటి పన్నుల సొమ్ము స్వాహా

దేవరాపల్లి పంచాయతీలో భారీగా నిధులు గోల్‌మాల్‌?

బిల్‌ కలెక్టర్‌పై పంచాయతీ ఈవో ఫిర్యాదుతో వెలుగులోకి..

కార్యాలయ సిబ్బంది హస్తంపైఅనుమానాలు

లోతుగా విచారణ చేస్తే మరింత అవినీతి బయటపడే అవకాశం

దేవరాపల్లి: తన అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతుండగానే మునగపాక నుంచి దేవరాపల్లికి బదిలీపై వచ్చిన బిల్‌ కలెక్టర్‌ మరోమారు వక్రబుద్ధి ప్రదర్శించారు. ఇక్కడ ప్రజల నుంచి వసూలు చేసిన ఇంటి పన్నుల సొమ్ము ప్రభుత్వానికి చెల్లించకుండా స్వాహా చేశారు. ఇందులో ఇతర సిబ్బంది హస్తం ఉందని తెలుస్తోంది. ఈ విషయమై స్థానిక పంచాయతీ కార్యదర్శి అనంత ఉమాదేవి, ఎంపీడీవో ఎం.వి. సువర్ణరాజు వేర్వేరుగా జిల్లా పంచాయతీ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మునగపాక పంచాయతీలో బిల్‌ కలెక్టర్‌గా పనిచేసిన జె.జోగిరాజుపై వివిధ అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ విచారణ జరుగుతుండగానే ఆయన్ను గతేడాది అక్టోబర్‌లో దేవరాపల్లి పంచాయతీకి బదిలీ చేశారు. మునగపాకలో ప్రజలు చెల్లించిన ఇంటి పన్ను సొమ్ములో రూ. 4.45 లక్షలు మేర జోగిరాజు స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే దేవరాపల్లిలో విధులు నిర్వర్తిస్తున్న అతడిపై మే 26న డీపీవో సస్పెన్షన్‌ వేటు వేశారు. అప్పటి నుంచి అతని స్వాధీనంలో ఉన్న రికార్డులను, బీరువా తాళాలను సైతం నేటి వరకు అప్పగించలేదు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు స్థానిక పంచాయతీ ఈవో అనంత ఉమాదేవి చేసిన పలు ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అతనిపై దేవరాపల్లి పోలీస్‌ స్టేషన్‌లో జూన్‌ 6న ఆమె ఫిర్యాదు చేయగా తిరస్కరించారు. డీపీవో, ఎంపీడీవో నుంచి ఫిర్యాదు వస్తే తప్పా తాము స్వీకరించలేమని పోలీసులు చెప్పినట్టు ఆమె తెలిపారు.

గతేడాది ఇంటి పన్ను సొమ్ము రూ. 6 లక్షలే జమ

దేవరాపల్లి పంచాయతీలో గత ఆర్థిక సంవత్సరం రూ. 13 లక్షల మేర ఇంటి పన్ను వసూలు కావాల్సి ఉంది. గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది మే 25వ తేదీ వరకు రూ. 6 లక్షలు మేర మాత్రమే బ్యాంక్‌లో జమ అయ్యింది. మిగిలిన సొమ్ములో ఎంత మేర వసూలు అయ్యిందో అనే దానిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. తమ వద్ద ఉన్న ప్రాథమిక సమాచారంతో ఇంటి పన్ను చెల్లించాలంటూ కొంతమందికి పంచాయతీ కార్యాలయ సిబ్బంది ఫోన్‌ చేయగా, వారి ఇంటి పన్ను చెల్లించిన రసీదు తెచ్చి చూపిస్తుండటంతో ఈవో నివ్వెరపోతున్నారు. దీంతో మునగపాక పంచాయతీ మాదిరిగానే దేవరాపల్లిలోనూ బిల్‌ కలెక్టర్‌ స్వాహా చేసి ఉంటాడన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. అతడిపై ఎంపీడీవోకి గత నెల 20న లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానన్నారు. దీనిపై ఎంపీడీవో ఎం.వి. సువర్ణరాజును వివరణ కోరగా, పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు బిల్‌ కలెక్టర్‌పై డీపీవోకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ అవినీతి బాగోతంపై డీపీవో ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

అవినీతి వెనుక ఎవరెవరి హస్తాలున్నాయో...

స్థానిక పంచాయతీపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తగా, ఇంటి నిర్మాణ అనుమతుల పేరిట పెద్ద ఎత్తున కొందరు అనధికారికంగా వసూళ్లకు పాల్పడ్డారని కొన్నేళ్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగు చూసిన అవినీతి ఆరోపణలతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి పంచాయతీలో జరిగిన అవినీతి లక్షల్లో ఉంటుందని విశ్వసనీయ సమాచారం. పంచాయతీలో అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేపడితే నిధులు దుర్వినియోగం సహా అవినీతి బట్టబయలవుతుంది. ఈ అవినీతి వెనుక ఎవరెవరి హస్తాలు ఉన్నాయో ఉన్నతాధికారులు విచారించి నిగ్గు తేల్చాలని స్థానికుల డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement