
గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు
నాతవరం: గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం నాతవరం పోలీసు స్టేషన్‌లో నిందితుల వివరాలను నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్. రేవతమ్మ వెల్లడించారు. నాతవరం మండలం చమ్మచింత వద్ద ఎస్‌ఐ వై. తారకేశ్వరరావు తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో రెండు బైకులపై వచ్చిన నిందితులు వారిని చూసి పారిపోతుండగా, ఎస్‌ఐ వెంబడించి చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల వద్ద బ్యాగ్‌లు తనిఖీలు చేయగా గంజాయి లభ్యమైంది. రెండు బైక్‌లతోపాటు నలుగురిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఒడిశాలో జనతాపాయ్ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి ఏజెన్సీ మీదుగా మైదాన ప్రాంతానికి రవాణా చేసి అధిక ధరకు అమ్ముతున్నట్లుగా విచారణలో అంగీకరించారు. పట్టుబడిన వారిలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంతలగుమ్మి గ్రామానికి చెందిన చింతల బుజ్జిబాబు, వంతల ఈశ్వర్, తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లాకు చెందిన కూతాటి శివకుమార్, నల్లగొండ జిల్లా కేంద్రం అబ్బానియా కాలనీకి చెందిన మహమ్మద్ పుర్ఖాన్ ఉన్నారు. వారి నుంచి కేజీ లిక్విడ్‌తోపాటు ఐదు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ. 5 లక్షలుపైగా ఉంటుందని సీఐ తెలిపారు. ఎస్‌ఐ తారకేశ్వరరావుతోపాటు సిబ్బందిని అభినందించారు.