
సజ్జల దృష్టికి బల్క్‌డ్రగ్ పార్క్ ఉద్యమం
నక్కపల్లి: మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న ఉద్యమాన్ని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి, సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి స్థానిక పార్టీ నేతలు తీసుకెళ్లారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, దంతులూరి దిలీప్‌కుమార్ కలిశారు. ఈ సందర్భంగా నెల రోజుల నుంచి మత్స్యకారులు చేస్తున్న నిరాహారదీక్ష, జాతీయ రహదారి దిగ్బంధనం వంటి ఆందోళనలను వారు వివరించారు. శాంతియుతంగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం, పోలీసులు అనుసరిస్తున్న వైఖరి, కేసులు నమోదు, మత్స్యకారులకు మద్దతు తెలిపేవారిని అడ్డుకోవడం, గృహ నిర్బంధం చేయడం వంటి వాటిని తెలియజేశారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నం మెడికల్ కళాశాల సందర్శనకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్థానిక మత్స్యకారులతో కలసి వినతిపత్రం ఇచ్చామన్నారు. బల్క్ డ్రగ్ పార్క్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయనకు వివరించామన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయలేదని, ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారన్నారు. స్టీల్‌ప్లాంట్ రెండో దశ కోసం అదనంగా ప్రభుత్వం భూసేకరణకు సన్నాహాలు చేస్తోందని, రైతులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. బల్క్ డ్రగ్‌కు వ్యతిరేకంగా నెల రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమం వివరాలను సజ్జలకు అందజేసి, పార్టీ తరపున మత్స్యకారులకు అండగా నిలవాలని కోరారు. సజ్జలను కలిసిన వారిలో పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలకుడు పైలా శ్రీనివాసరావు, ఎంపీటీసీ గంటా తిరుపతిరావు, పార్టీ నాయకుడు తళ్ల భార్గవ్ తదితరులు ఉన్నారు.