
పరారై ఆరేళ్ల తర్వాత చిక్కిన హత్యకేసు నిందితుడు
ఆరిలోవ: కోర్టు కేసు నడుస్తుండగా ఆరేళ్ల క్రితం పరారైన ఓ హత్య కేసులోని ప్రధాన నిందితుడిని ఆరిలోవ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎన్ని చోట్ల గుట్టుగా గడిపినా చివరికి వెతికి పట్టుకుని, కటకటాల వెనక్కి పంపించారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో ద్వారకా జోన్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి మంగళవారం మీడియాకు తెలిపిన వివరాలు.. ఆరిలోవ ప్రాంతం ప్రియదర్శినికాలనీ, సెయింట్ ఆన్స్ స్కూల్ వెనుక 2011 జూన్ 12న పందిరి రవి అలియాస్ చిత్తిరి రవి హత్యకు గురయ్యాడు. పాత కక్షల కారణంగా రవిని బాలాజీనగర్‌కు చెందిన తిరుమల రాఘవరాజు(ప్రస్తుత వయసు 40)తో పాటు మరో ఆరుగురు కలసి కత్తులతో దాడిచేసి సినీ ఫక్కీలో హత్య చేశారు. ఈ కేసులో ఏడుగురు ముద్దాయిలను ఆరిలోవ పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అదే ఏడాది జూలై 1న వారిపై రౌడీ షీట్లు తెరిశారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఏ1 ముద్దాయి రాఘవరాజు 2019 జూలై 24 నుంచి కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు. రౌడీ షీట్ ఉన్నందున పోలీస్ స్టేషన్‌కూ వెళ్లకుండా పరారయ్యాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం ఎంత గాలించినా పట్టుబడలేదు. దీంతో కోర్టు 2023 మార్చి 10న మిగిలిన ఆరుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అప్పటికే ఈ కేసులో ఉన్న ముగ్‌గ్రుు ముద్దాయిలు మరణించారు. మిగిలిన ముగ్గురు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆరిలోవ సీఐ హెచ్.మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ పీడీబీ శంకర్, పీఎస్‌ఐ వరహాలు నాయుడు, కానిస్టేబుల్ జి.అప్పారావు బృందం ఆరు నెలల పాటు ప్రత్యేక నిఘా పెట్టారు. డిజిటల్ వాచ్ చేపట్టారు. చోడవరం ప్రాంతంలో ముద్దాయి ఓ క్వారీలో కూలీగా పనిచేస్తున్నట్లు తెలుసుకుని అక్కడకు చేరుకొన్నారు. పోలీసుల ఆచూకీ గమనించిన ముద్దాయి అక్కడి నుంచి అనకాపల్లి ప్రాంతానికి చేరుకుని కొన్నాళ్లు ట్యాక్సీవాలా అవతారం ఎత్తాడు. అతని ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు అనకాపల్లి మారుమూల గ్రామంలో మంగళవారం తిరుమల రాఘవరాజును పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ నర్సింహమూర్తితో పాటు సీపీ శంఖబ్రత బాగ్చి ఫోన్‌లో సీఐ మల్లేశ్వరరావు బృందాన్ని అభినందించారు.

పరారై ఆరేళ్ల తర్వాత చిక్కిన హత్యకేసు నిందితుడు