
ఆరిపోయిన ఆశల దీపం
● బైకును ఢీకొన్న కారు
● తమ్ముడు మృతి, అన్నకు గాయాలు
● విజయరామరాజుపేట రోడ్డులో ఘటన
బుచ్చెయ్యపేట: ఆశల దీపం ఆరిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్న కుమారుడిని కారు రూపంలో మృత్యువు కబళించింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట, కోనాం ఆర్‌అండ్‌బీ రోడ్డులో శనివారం ద్విచక్ర వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో తమ్ముడు మృతి చెందగా.. అన్న గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మృతుడ్ని ఆస్పత్రిలో చేర్పించి పరారయ్యాడు. బుచ్చెయ్యపేట అదనపు ఎస్‌ఐ భాస్కరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కుముదాంపేట గ్రామానికి చెందిన ఆది గిరిబాబు, లక్ష్మీకుమారిలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బాబీ బీటెక్, రెండో కుమారుడు హర్షవర్థన్(19) ఇంటర్ సెకండియర్ విశాఖలోని ఓ ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్నారు. శనివారం సాయంత్రం అన్నదమ్ములిద్దరూ ద్విచక్ర వాహనంపై వడ్డాది వెళ్లి స్వగ్రామం కుముదాంపేటకు తిరిగి వస్తుండగా అప్పలరాజుపురం నుంచి చోడవరం వైపు వెళ్తున్న కారు ఢీకొంది. కుముదాంపేట గ్రామ సమీపంలో దాడి సత్యనారాయణ కళ్లాల వద్ద మలుపులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న సోదలిద్దరూ రోడ్డుపై తుళ్లిపడిపోయారు. స్పహ తప్పిపడిపోయిన హర్షవర్థన్‌ను అదే కారులో చికిత్స నిమిత్తం చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రి సిబ్బంది పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. బాబీకి స్వల్ప గాయాలయ్యాయి. వ్యవసాయం చేసుకుని జీవించే గిరిబాబు కుమారులిద్దరిని ప్రయోజకుల్ని చేయాలని ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. ప్రయోజకుడు అవుతాడనుకున్న కుమారుడి మృత్యు ఒడికి చేరడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. మృతుడి తండ్రి గిరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుచ్చెయ్యపేట అదనపు ఎస్‌ఐ భాస్కరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం హర్షవర్థన్ మృతదేహాన్ని చోడవరం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.