
ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం
అనకాపల్లి: ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలకు శుక్రవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రావాల్సిన కోట్ల రూపాయల బకాయిలను కూటమి ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా) ఆధ్వర్యంలో నెట్‌వర్క్ ఆస్పత్రులు సేవలను నిలిపివేశాయి. దీంతో చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లిన పేద రోగులు ఓపీ సేవలు దొరక్క నిరాశతో వెనుదిరిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలను పెండింగ్‌లో పెట్టింది. ఆస్పత్రులకు ఆర్థిక భారం పెరగడంతో ‘ఆషా’ సేవలు నిలిపివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగ ఆరోగ్య పథకం కింద సేవలను నిలిపివేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది.ఈ సేవలు నిలిపివేయడంతో, పేదలు, ప్రభుత్వ ఉద్యోగులు చికిత్స పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేకు పడటంతో జిల్లా నెట్‌వర్క్ ఆస్పత్రులపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లా పరిధిలో ఆరోగ్యశ్రీ కింద 5 ఆస్పత్రులు నెట్‌వర్క్‌లో ఉండగా, మొదటి రోజు అత్యవసర సేవలను మాత్రమే స్వీకరించారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ సేవలను పూర్తిగా నిలిపివేశారు. చికిత్స కోసం వచ్చిన ఎంతో మంది రోగులు నెట్‌వర్క్ ఆస్పత్రుల నుంచి నిరాశగా తిరిగి వెళ్లాల్సి వచ్చింది. రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త తెలిపారు. రోగులకు అంతరాయం కలిగితే తమను సంప్రదించాలన్నారు.