
కుటీర పరిశ్రమగా కల్తీ మద్యం తయారీ
అనకాపల్లి: కూటమి ప్రభుత్వంలో పెద్దల అండ దండలతోనే కల్తీ మద్యం తయారీ కుటీర పరిశ్రమగా మారిందని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రా దేముడు ఆరోపించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు బత్తిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా దేముడు మాట్లాడుతూ మద్యం కంపెనీలకు దీటుగా అధునాతన యంత్రాలు ఏర్పాటు చేసి స్పిరిట్‌తో కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ప్రకృతి సిద్ధమైన తాటికల్లును కూటమి ప్రభుత్వం కనుమరుగు చేసి, కల్తీ మద్యాన్ని, అక్రమ మద్యాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ కల్లుగీత కార్మికులకు కష్టాలు తప్పడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మి ఓట్లేసిన పాపానికి గీత కార్మికులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 75 వేల బెల్ట్ షాపులను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యాన్ని అరికట్టి కల్లును ప్రోత్సహించాలని గీత కార్మికులు రోడ్డెక్కి 50 రోజుల పాటు ఆందోళ చేసినా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తిన నాగేశ్వరరావు మాట్లాడుతూ కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి, గీత కార్మిక కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గండిపోయిన రాము, కె.ఈశ్వరరావు, కర్రి అప్పలరాజు, దొడ్డి నారాయణ, అనుసూరి నూకప్పరావు, పాత బాబు, నడిగట్ల తాతబాబు, నడిగట్ల సన్యాసిరావు పాల్గొన్నారు.
చంద్రబాబు హయాంలో
కల్లుగీత కార్మికులకు తప్పని కష్టాలు
రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా
మార్చేశారు..
కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేముడు