
ఆడబిడ్డలకు అన్యాయం
● పీ4తో అనుసంధానం చేసి చేతులు దులుపుకున్న చంద్రబాబు
● బంగారు కుటుంబాలను దాతలే ఆదుకోవాలంటున్న సర్కారు
● దాతలను వెతికే పనితో తలలు పట్టుకుంటున్న ఉద్యోగులు
సాక్షి, అనకాపల్లి:
ఆడబిడ్డను ఆదుకుంటానని ఓట్లు వేయించుకున్నారు.. అధికారం చేతికిచ్చాక అక్కచెల్లెమ్మలను నిలువునా ముంచేశారు. ‘ఆడబిడ్డ నిధి’ పేరిట 18 –60 ఏళ్ల లోపు మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. దీనిని సూపర్ సిక్స్‌లో పెట్టి మేనిఫెస్టోను బాగా ప్రచారం చేసుకున్నారు. ఈ పథకం ప్రారంభం కాకుండానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి.. అన్నట్టు పీ4తో అనుసంధానం చేసేశాం. ఇక దాతలదే భారం అని చేతులెత్తేశారు. జిల్లాలో 80,163 బంగారు కుటుంబాలను గుర్తించి, దాతలను వెదికే బాధ్యతను ఉద్యోగులకు అప్పగించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బంగారు కుటుంబాలను దత్తత చేసుకోమని మద్యం షాపులను నడిపేవారిని, చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునేవారిని బతిమాలి, భయపెట్టి రకరకాల విన్యాసాలు చేసినా ఫలితం లేకపోయింది.
దాతలు కావలెను
పీ4 కోసం దాతలను వెదికే పని అధికారులకు జీవన్మరణ సమస్యగా మారింది. ప్రభుత్వం శాఖల వారీగా బాధ్యతలు అప్పగించినా ఫలితం లేకపోయింది. తమకు అప్పగించొద్దంటూ ఉపాధ్యాయులు పీ4 ప్రక్రియకు పూర్తిగా దూరమయ్యారు. ఇక ఆ ప్రక్రియలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని కూడా కలిపారు. నెల క్రితం బంగారు కుటుంబాల మార్గదర్శకాల మ్యాపింగ్ పూర్తిచేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలను కూడా జారీ చేసింది. అంతేకాకుండా పీ4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలకు, మార్గదర్శులకు సంధానకర్తలుగా వ్యవహరించాలంటూ కూడా ఒత్తిడి పెంచింది. వలంటీర్ వ్యవస్థను నిలిపివేయడంతో అసలే పని భారం పెరిగిన సచివాలయ ఉద్యోగులు జిల్లా ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు నామమాత్రంగానే ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు.
వెబ్‌సైట్‌లో కాకి లెక్కలు
అధికారిక వెబ్‌సైట్‌లో అధికారులు పొందుపరిచిన గణాంకాల ప్రకారం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని 522 సచివాలయాల పరిధిలో మొత్తం 80,163 బంగారు కుటుంబాలను గుర్తించారు. ఆ కుటుంబాల్లో 2,06,526 మంది సభ్యులున్నట్టు లెక్కకట్టారు. వీరిని దత్తత తీసుకునేందుకు జిల్లాలో 6,420 మంది మార్గదర్శులు ముందుకు వచ్చినట్లు వెబ్‌సైట్‌లో పెట్టారు. ఇప్పటికి 47,597 కుటుంబాలను మార్గదర్శులు దత్తత చేసుకున్నట్లు.. ఇంకా 32,571 కుటుంబాలను దత్తత చేసుకోవాల్సి ఉన్నట్లుగా వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. కానీ క్షేత్ర స్థాయిలో వారి వివరాలు ఏమీ లేవు. ఎవరు ఏ కుటుంబాన్ని దత్తత చేసుకున్నారనే వివరాలు క్షేత్రస్థాయిలో సచివాలయాల వారీగా పొందుపరచలేదు. సచివాలయ ఉద్యోగులను, అధికారులను అడిగితే వెబ్‌సైట్‌లో చూసుకోవా లని చెబుతున్నారే తప్ప ఏ కుటుంబాన్ని ఎవరు దత్తత తీసుకున్నారనే వివరాలను పొందుపరచడం లేదు. ఇవన్నీ కాకిలెక్కలేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
‘సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ అమలు చేసేశాం.. ఆడబిడ్డ నిధిని పీ4కు అనుసంధానం చేస్తాం.. ఇది పేదల ఇంట కొత్త వెలుగు’ అని విశాఖలో చంద్రబాబు చెప్పారు. అమలు గాని హామీతో మహిళలను మోసం చేయడమే కాకుండా.. పీ4 పేరిట కాలయాపన చేస్తున్నట్లు మహిళలు సైతం మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఆడబిడ్డ నిధి ద్వారా లబ్ధి చేకూరుతుందని
ఆశపడ్డ అక్క చెల్లెమ్మలు కూటమి ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు.
ఆడబిడ్డలకు రూ.1,314 కోట్లు బాకీ పడ్డ బాబు సర్కారు
జిల్లావ్యాప్తంగా 18–60 ఏళ్ల వయసున్న 5,47,888 మంది పేద మహిళలను గుర్తించినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు పూర్తయింది. అంటే ఒక్కొక్కరికి నెలకు రూ.1500 చొప్పున 5,47,888 మంది మహిళలకు 16 నెలలకు రూ.1,314 కోట్లు ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించాల్సి ఉంది.
జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలు 80,163
ముందుకు వచ్చిన మార్గదర్శులు 6,420
వారు దత్తత తీసుకున్న కుటుంబాలు 47,597
దాతల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు 32,571