
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఉద్యమం
● మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
● కోటి సంతకాల సేకరణ ప్రారంభం
నర్సీపట్నం: ప్రజలకు కార్పొరేట్ వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ స్పష్టం చేశారు. వీటిలో నర్సీపట్నం వైద్య కళాశాల ఒకటి అన్నారు. వీటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టింది. నర్సీపట్నంలోని పార్టీ కార్యాలయంలో శనివారం కోటి సంతకాల వాల్ పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి గణేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయ టం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కళాశాలలను నిలిపివేశారని ధ్వజమెత్తారు. వీటిని పీపీపీ విధానంలో నిర్మించాలని టెండర్లను ఆహ్వానించడం దారుణమన్నారు. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో మెడికల్ కళాశాలలు ఉంటే పేదలకు ఉచిత వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రజల నుంచి కోటి సంతకాల ఉద్యమాన్ని నవంబరు 22 వరకు గ్రామాలు, పట్టణాల్లో నిర్వహిస్తామన్నారు. ఈ నెల 28న నియోజకవర్గ కేంద్రంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబరు 12న జిల్లా కేంద్రంలో ర్యాలీ ఉంటుందన్నారు. ప్రజల నుంచి సేకరించిన సంతకాలను 23న జిల్లా కేంద్రాలకు పంపనున్నట్లు వెల్లడించారు. అనంతరం 24న పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించిన తరువాత గవర్నర్‌కు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ ఉద్యమం రాజకీయ లబ్ధి కోసం చేసేది కాదని, ప్రజలందరూ స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో పాల్గొని మద్దతు తెలియజేయాలని కోరారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, స్టేట్ యూత్ వింగ్ నాయకుడు చింతకాయల వరుణ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివ, ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు, మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, మాకవరపాలెం, నర్సీపట్నం పార్టీ అధ్యక్షులు చిటికెల రమణ, శానపతి వెంకటరత్నం, జిల్లా నాయకులు బొడ్డు గోవిందరావు, పెట్ట భద్రాచలం, లెక్కల సత్యనారాయణ పాల్గొన్నారు.