
కట్టమంచికి అవమానం
స్నాతకోత్సవం చరిత్రలో
తొలిసారి వేదిక మార్పు
కన్వెన్షన్ సెంటర్‌కు తరలింపుపై
అభ్యంతరాలు
తీవ్ర వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన
ఏయూ అధికారులు
విశాఖ సిటీ: ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాలకవర్గం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏయూ పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే హాస్టళ్లలో సమస్యలు, పురుగుల భోజనం, విద్యార్థి మరణం వంటి అనేక వివాదాలు చుట్టుముట్టగా, తాజాగా స్నాతకోత్సవ వేదిక మార్పు అంశం అగ్గి రాజేస్తోంది. ఆంధ్రా యూనివర్సిటీ తొలి ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి(సీఆర్ రెడ్డి)ని అగౌరవపరిచేలా ఏయూ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వర్సిటీ వర్గాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కట్టమంచికి గౌరవార్థంగా ఏయూలో నిర్మించిన ‘కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవ రంగం(కాన్వొకేషన్ హాల్)’లోనే పట్టభద్రుల పట్టాల పండగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. చరిత్రలో తొలిసారిగా స్నాతకోత్సవం వేదికను మార్చాలనే నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కట్టమంచి నుంచి కన్వెన్షన్ సెంటర్‌కు..
ఏయూలో ఈ నెల 15న 91వ, 92వ స్నాతకోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రెండేళ్ల పట్టభద్రులకు ఒకేసారి పట్టాలు అందించాలని నిర్ణయించారు. ఎప్పటిలాగే కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవ రంగం హాల్‌లో కాన్వొకేషన్ జరుగుతుందని అందరూ భావించారు. అయితే.. ఈ స్నాతకోత్సవాన్ని అక్కడి నుంచి బీచ్‌రోడ్డులో ఉన్న ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు మార్చినట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై ఏయూలో పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. స్నాతకోత్సవాన్ని ఉత్సవ రంగంలో కాకుండా వేరే చోట నిర్వహించడం కట్టమంచిని అవమానించడమే అన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమయ్యాయి.
ఈ అంశంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో.. కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవ రంగం హాల్ మరమ్మతులకు గురైందన్న సాకును అధికారులు తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు జరిగిన అన్ని స్నాతకోత్సవాలు అక్కడే జరిగాయి. తాజాగా 91వ, 92వ కాన్వొకేషన్‌ను నిర్వహించాలని నిర్ణయించినప్పుడు, ఈలోపే మరమ్మతులు ఎందుకు పూర్తి చేయలేదన్న ప్రశ్నలను ఏయూలో కొందరు సంధిస్తున్నారు. ఏయూ ప్రారంభం నుంచి వస్తున్న సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు.
ఆలస్యంగా మరమ్మతులు
కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవ రంగం హాల్ మరమ్మతులకు గురైన మాట వాస్తవమే. పైన సీలింగ్ ఊడి పడే ప్రమాదం ఉంది. 91వ, 92వ కాన్వొకేషన్ నిర్వహించాలని నిర్ణయించడానికి ముందే ఈ మరమ్మతులను పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఆ పని చేయలేదు. ఇదిలా ఉండగా, ఇటీవల ఇందులో పనిచేస్తున్న కార్మికుడొకరు పై నుంచి కిందపడి మరణించారు. దీంతో పోలీసులు తాత్కాలికంగా పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా మరమ్మతు పనులు మరింత ఆలస్యమయ్యాయి.