
రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి
తుమ్మపాల: రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆమె గత సమావేశంలో చర్చించిన విషయాలపై తీసుకున్న చర్యలు, ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలుగా (బ్లాక్ స్పాట్స్) గుర్తించిన 26 ప్రాంతాల్లో తక్షణమే చర్యలు చేపట్టాలని, 15 రోజుల్లో నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత వాహనాలతో పాటు, మైనింగ్ రవాణా వాహనాలను నిత్యం పర్యవేక్షించాలని, ఓవర్ లోడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు, రెవెన్యూ, జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలను ఐ–రాడ్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రులన్నీ రిజిస్ట్రేషను చేయించుకోవాలని, యాక్సిడెంట్ కేసులను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, నర్సీపట్నం ఆర్‌డీవో వి.వి. రమణ, జిల్లా రవాణా అధికారి జి.మనోహర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి హైమావతి, రోడ్లు భవనాల శాఖ ఈఈ ఎన్.సాంబశివరావు, డీఈఈ విద్యాసాగరరావు, పోలీసు, మైనింగు, ఆర్‌టీసీ అధికారులు పాల్గొన్నారు.