ఎగసిపడ్డ నిరసన కెరటం | - | Sakshi
Sakshi News home page

ఎగసిపడ్డ నిరసన కెరటం

Oct 8 2025 6:37 AM | Updated on Oct 8 2025 6:37 AM

ఎగసిప

ఎగసిపడ్డ నిరసన కెరటం

హోం మంత్రికి ముందు నుయ్యి, వెనుక గొయ్యి

నక్కపల్లి: రాజయ్యపేటలో మత్స్యకారుల ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. 24వ రోజుకు చేరుకున్నా అదే తీవ్రతతో కొనసాగుతోంది. తమ ఉనికికి విఘాతంగా నిలిచే బల్క్‌డ్రగ్‌ పార్క్‌ను రద్దు చేయాలంటూ మత్స్యకారులు చేస్తున్న నిరశన దీక్షకు వివిధ ప్రజాసంఘాలు, పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా ఆదివారం ఆనందపురంలో జరిగిన ఉత్తరాంధ్ర స్థాయి వైఎస్సార్‌సీపీ విస్తృత సమావేశంలో బల్క్‌డ్రగ్‌ పార్క్‌ రద్దు చేయాలన్న ప్రస్తావన వచ్చింది. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో కూడా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు, ఎంపీలు మత్స్యకారులకు మద్దతుగా బల్క్‌డ్రగ్‌ పార్క్‌ ప్రస్తావన తీసుకువచ్చారు. బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌ మత్స్యకారుల దీక్షకు మద్దతుగా రాజయ్యపేట వస్తుంటే ఇటీవల రాజమండ్రి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. దీక్షలో పాల్గొనకుండా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజును గృహనిర్బంధం చేశారు. సంఘీభావం తెలిపేందుకు సోమవారం రాజయ్యపేట బయలుదేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. అదేవిధంగా మంగళవారం డీసీసీ అధ్యక్షుడు మీసాల సుబ్బన్నను కూడా అడ్డుకొని, సెక్షన్‌ 30 యాక్ట్‌ అమల్లో ఉందంటూ నిలువరించారు.

రోజురోజుకు తీవ్రతరం

24 రోజుల క్రితం గ్రామంలో ప్రశాంతంగా ప్రారంభమయిన దీక్ష రోజురోజుకు తీవ్రతరమైంది. నాలుగు రోజుల ఆందోళన తర్వాత పనులు అడ్డుకున్నారు. ప్రభుత్వం గానీ, స్థానిక ప్రజాప్రతినిధి, హోం మంత్రి వంగలపూడి అనిత గానీ స్పందించక పోవడంతో ఆగ్రహం చెందిన మత్స్యకారులంతా రోడ్డుపై నిప్పు పెట్టి బల్క్‌డ్రగ్‌ పార్క్‌ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ వాహనాలను అడ్డుకున్నారు. అధికారులు చర్చలు జరిపినా ఫలితం దక్కలేదు. దీంతో దిగి వచ్చిన హోం మంత్రి మత్స్యకారులతో చర్చలు జరుపుతానని వీడియో సందేశం పంపించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రి అనిత రాజయ్యపేట వచ్చినప్పుడు మత్స్యకారులు ఆమె కాన్వాయ్‌ను అడ్డుకురన్నారు. గ్రామస్తులంతా కమిటీగా ఏర్పాటయి వస్తే సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్తానని మంత్రి అనిత చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని పట్టుబట్టారు. దీంతో ఆందోళన కారుల నుంచి తప్పించుకునేందుకు బల్క్‌డ్రగ్‌ పార్కు పనులు తాత్కాలికంగా నిలిపివేస్తామని, సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని ప్రకటించి అక్కడ నుంచి బయట పడ్డారు. అయితే గంగపుత్రుల ఆందోళన మాత్రం కొనసాగుతోంది. వీరి దీక్షలకు వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ, జాతీయ మత్స్యకార సంఘం, సంప్రదాయ మత్స్యకార సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.

నిర్బంధాలు ఎదురైనా ఆగని మత్స్యకారుల పోరాటం

బల్క్‌డ్రగ్‌ పార్కు ఉద్యమానికి

పెరుగుతున్న మద్దతు

అండగా నిలుస్తున్న నేతలను

అడ్డుకుంటున్న పోలీసులు

అయినా వెల్లువలా సంఘీభావం

తాజాగా వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర

సమావేశంలో బల్క్‌డ్రగ్‌ పార్క్‌

నిలిపివేయాలని తీర్మానం

హోం మంత్రికి ఉక్కిరిబిక్కిరి

బల్క్‌డ్రగ్‌ పార్కు వ్యవహారం హోం మంత్రి వంగలపూడి అనిత మెడకు చుట్టుకుంటోంది. ఆమె పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారయింది. రెండేళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. రాజయ్యపేటలో హెటెరో డ్రగ్స్‌ వారు సముద్రంలోకి ఏర్పాటు చేస్తున్న పైపులైను వద్దంటూ మత్స్యకారులు చేసిన ఆందోళన శిబిరం వద్దకు వెళ్లి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నాటి మాటలు నేడు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. ఈ విమర్శలతో మంత్రికి ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. పనులు తాత్కాలికంగా నిలిపివేసి మత్స్యకారులను శాంతింపచేసే ప్రయత్నాలు జరిగినప్పటికీ ఎంతో కాలం కొనసాగే అవకాశం కనిపించడం లేదు. ఇది మంత్రి స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదు. కాంట్రాక్టర్‌ గనుక ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే పనులు తిరిగి పునః ప్రారంభమవుతాయి. దీంతో మత్స్యకారులు మరింత ఆగ్రహించే పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరోపక్క ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా సాగుతోంది. మంత్రి గ్రామంలోకి వచ్చి వెళ్లిన తర్వాత టీడీపీకి చెందిన ముఖ్యనాయకులు నిరాహార దీక్షలో పాల్గొనేందుకు దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే మత్స్యకార యువత మాత్రం ఈ వ్యవహారంలో తాడోపేడో తేల్చుకునేందుకు, అవసరమైతే ఏ స్థాయికై నా పోరాటాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. మంత్రి గ్రామంలోకి వచ్చి వెళ్లి వారం రోజులు దాటింది. దీనిపై ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఉద్యమం మాత్రం కొనసాగుతోంది.

ఎగసిపడ్డ నిరసన కెరటం1
1/1

ఎగసిపడ్డ నిరసన కెరటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement