
జనసేనలోకి వస్తే ఎంపీపీగా కొనసాగిస్తామన్నారు
● వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభపెట్టి అవిశ్వాసం పెట్టారు
● పార్టీ కంటే ఎంపీపీ పదవి ముఖ్యం కాదు
● ఎంపీపీ బోదెపు గోవింద్ వెల్లడి
యలమంచిలి రూరల్: జనసేనలో చేరితే ఎంపీపీ పదవిలో పూర్తి కాలం ఉంచుతామని తనపై స్థానిక జనసేన నాయకులు ఒత్తిడి తెచ్చారని, పార్టీ ఆవిర్భావం నుంచీ తాను వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతున్నానని, పార్టీ కంటే ఎంపీపీ పదవి తనకు ముఖ్యం కాదని యలమంచిలి ఎంపీపీ బోదెపు గోవింద్ అన్నారు. ఉన్నతమైన పార్టీ పదవిని అధినేత వైఎస్ జగన్ తనకిచ్చారని, అంతకంటే ఇంకేం కావాలన్నారు. ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కౌన్సిల్ (ఎస్‌ఈసీ) సభ్యుడిగా నియమితులైన గోవింద్‌ను మంగళవారం యలమంచిలి పార్టీ కార్యాలయంలో యలమంచిలి సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉంటున్నాయన్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే, కూటమి పార్టీల నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకులను ప్రలోభపెట్టి తమ పార్టీల్లోకి అనైతికంగా చేర్చుకుంటున్నారన్నారు. గతంలో ఎప్పుడూ యలమంచిలి నియోజకవర్గంలో ఈ సంప్రదాయం లేదని, కూటమి పార్టీల నాయకులకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. పదవుల కోసం పార్టీలు మారడం అత్యంత అనైతిక చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. యలమంచిలి మండల పరిషత్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభపెట్టి అవిశ్వాసానికి తెగబడ్డారని దుయ్యబట్టారు. ఇలాంటి అనైతిక చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారని, కూటమి నాయకులకు తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు.