
కవయిత్రి మొల్ల విగ్రహావిష్కరణ
కోటవురట్ల: స్థానిక కుమ్మరి వీధిలో కవయిత్రి మొల్ల విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. విగ్రహాన్ని జానకి హరి వితరణ చేయగా.. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గానికి చెందిన కుమ్మరి శాలివాహన డైరెక్టర్ ఎం.విజయ కుమారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కవయిత్రి మొల్ల రచనలు సరళ పద్ధతిలో రమణీయంగా ఉంటాయన్నారు. మొల్ల రచించిన రామాయణం విశేష ప్రాచుర్యం పొందిందన్నారు. 16వ శతాబ్దానికి చెందిన మొల్ల 5 రోజుల్లోనే రామాయణాన్ని రచించి అబ్బురపరిచారన్నారు. కమ్యూనిటీ హాల్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని నిర్మాణానికి సహకరించాలని స్థానికులు విజయకుమారిని కోరారు. స్పందించిన ఆమె శాలివాహన సంఘ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జానకి హరి, జానకి శ్రీను, శాలివాహన కమిటీ జిల్లా అధ్యక్షుడు పి.అప్పలకొండ, వైస్ ప్రెసిడెంట్ శ్రీను, కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ దాసరి వెంకటరావు, ఉప సర్పంచ్ గవ్వా రాధాకృష్ణ, స్థానికులు పాల్గొన్నారు.