
పేట డైవర్షన్ రోడ్డులో ఆటోలు బోల్తా
● పలువురికి గాయాలు
● వడ్డాది పెద్దేరు వంతెనపై ట్రాఫిక్ జామ్
● ప్రయాణికుల అవస్థలు
బుచ్చెయ్యపేట: అస్తవ్యస్తంగా ఉన్న భీమునిపట్నం,నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ఆదివారం విజయరామరాజుపేట తాచేరు వంతెనపై ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డుపై ఆటో బోల్తా పడగా, అందులో ప్రయాణిస్తున్న పలువురు తాచేరు నదిలో పడి, స్వల్ప గాయాలతో బయట పడ్డారు. రెండు నెలలు కిందట వర్షాలకు కొట్టుకుపోయిన తాచేరు డైవర్షన్ రోడ్డు మరమ్మతు పనులు రూ.15 లక్షలతో చేపట్టారు. సిమెంట్ పైపులు, వాటిపై గ్రావెల్ వేశారు. అయితే సరిగా రోలింగ్ చేయకుండా వదిలేశారు. పనులు పూర్తి స్థాయిలో చేయకుండానే శనివారం సాయంత్రం నుంచి వాహనాలు వెళ్లేలా బారికేడ్లు తీసివేశారు. దీంతో పలువురు వాహనదార్లు డైవర్షన్ రోడ్డుపై నుంచి రాకపోకలు సాగించారు. తాచేరు నదిపై కొత్తగా వేసిన డైవర్షన్ రోడ్డు గోతుల్లో పడి ప్రయాణికులతో వస్తున్న ఆటో బోల్తా పడింది. ప్రయాణికులు నదిలో పడిపోయారు. నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో ఆటో డ్రైవర్, పలువురు ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. ఇదే ప్రదేశంలో మరో తొట్టె ఆటో బోల్తా పడింది. స్థానికుల సహకారంతో బోల్తా పడిన ప్రయాణికుల ఆటోతో పాటు గూడ్స్ ఆటోను బయటకు తీశారు. డైవర్షన్ రోడ్డు పనులు పూర్తి చేయకుండానే వాహనాలను అనుమతించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల కిందట పేట డైవర్షన్ రోడ్డుపై నుంచి తాచేరు నదిలో పడిపోయి కొట్టుకుపోయి పేట గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి,వడ్డాదికి చెందిన రైతు మృతి చెందిన విషయం తెలిసిందే.
వడ్డాది పెద్దేరు వంతెనపై ట్రాఫిక్ జామ్
మేజర్ పంచాయతీ వడ్డాది పెద్దేరు వంతెనపై ఆదివారం ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటరు దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం వడ్డాది సంత కావడంతో పలు గ్రామాల నుంచి వచ్చిన వ్యాపారులు, కొనుగోలుదారులతో పాటు పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో వడ్డాది రోడ్డు నిండిపోయింది. వడ్డాది పెద్దేరు నదిపై ఉన్న పాత బ్రిడ్జితో పాటు పక్క నుంచి వేసిన డైవర్షన్ రోడ్డుపైన ట్రాఫిక్ జామ్ అయింది. పాడేరు నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న 108 వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. స్థానికులు సాయంతో వాహనాలను పక్కకు తీయించి 108 వెళ్లేలా రహదారి కల్పించారు. ప్రతి ఆదివారం వడ్డాదిలో ట్రాఫిక్ జామ్ జరిగి, పలువురు ఇబ్బందులు పడుతున్నా పోలీసులు చర్యలు చేపట్టడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

పేట డైవర్షన్ రోడ్డులో ఆటోలు బోల్తా

పేట డైవర్షన్ రోడ్డులో ఆటోలు బోల్తా