
ఆరు పదులు... ఆనందానికి లేవు హద్దులు
● చోడపల్లిలో 1980 బ్యాచ్
విద్యార్థుల ఆత్మీయ కలయిక
అచ్యుతాపురం: వారంతా ఆరు పదుల వయస్సు దాటిన వారే.. కొందరు తాతలు, మరి కొందరు ముత్తాతలయ్యారు. కొందరు విశ్రాంత జీవనం సాగిస్తున్నారు. 45 ఏళ్ల కిందట వారంతా ఒక బడిలో చదువుకున్నారు. ఆదివారం కలుకుని, బాల్యస్నేహితులను తనివితీరా చూసి, నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ ఆత్మీయ కలయికకు మండలంలోని చోడపల్లిలో చోడమాంబిక అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతం వేదికై ంది. మునగపాక ఉన్నత పాఠశాలలో 1980లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు అచ్యుతాపురం మండలంలోని చోడపల్లిలో కలుసుకుని సందడి చేశారు. 33 ఏళ్లుగా ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా వీరు కలుస్తున్నారు. ఈ సందర్భంగా బ్యాచ్‌లో ఉన్నత స్థానాల్లో ఉండి పదవీ విరమణ పొందిన వారిని సత్కరించారు.స్టీల్ ప్లాంట్, వైద్య,విద్యా శాఖల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన వారంతా తమ ఉద్యోగంలో అనుభవాలు, ఇతర విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం డీఎంవో పి.సత్యనారాయణ, జీవీఎంసీ ఎంటమాలజిస్ట్ డి.సాంబమూర్తి,పీడీగా పదవీ విరమణ పొందిన పెంటకోట రాము,హరిపాలెం పీహెచ్‌సీ సూపర్‌వైజర్ ఎస్. శ్రీను,కొండకర్ల నీటి సంఘం మాజీ అధ్యక్షుడు బి.వి.రాము, అచ్యుతాపురం మాజీ జెడ్పీటీసీ జనపరెడ్డి శ్రీనివాసరావు, ఎన్.సత్యనారాయణ, కె.పి.రావు, ఎ.వి.ఎస్.అప్పారావు, సీహెచ్ పారునాయుడు తదితరులు పాల్గొన్నారు.