
కదం తొక్కిన ఉపాధ్యాయులు
నర్సీపట్నం: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శనివారం జిల్లా వ్యాప్తంగా కదం తొక్కారు. న ర్సీపట్నంలో సీబీఎం కాంపౌండ్ నుంచి పెదబొడ్డేపల్లి జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీని ఉద్దేశించి జిల్లా ఫ్యాప్టో సెక్రటరీ వై.సుధాకరావు, నర్సీపట్నంశాఖ నాయకులు పడాల అప్పారావు, ఎం.చిట్టియ్య, జానకీరామ్‌నాయుడు, డి.నూకరాజు, కె.సత్యనారాయణ, ఆర్.వి.దొర మాట్లాడుతూ నాలుగు డీఎలను మంజూరు చేయాలని, 30 శాతం ఐఆర్ వెంటనే మంజూరు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఆరు మండలాల నుంచి వంద మంది ఉపాధ్యాయులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
చోడవరంలో ఉపాధ్యాయుల బైక్ ర్యాలీ
చోడవరం: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చోడవరం మెయిన్‌రోడ్డులో కాలేజీ జంక్షన్ నుంచి కొత్తూరు వరకూ మోటారు సైకిళ్లపైన ర్యాలీ చేశారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఐఆర్ ప్రకటించాలని, రావలసిన అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని, ఈహెచ్‌ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినా ఇప్పటి వరకూ ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని ఫ్యాప్టో ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమరాన త్రినాథరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు మైచర్ల మహాలక్ష్మీనాయుడు, మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆర్. చిరంజీవి, కె. మల్లేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు గొల్లు శ్రీనివాసరావు, యూటీఎఫ్ ప్రతినిధులు పొలిమేర చంద్రరావు, జేపీఎస్ కృష్ణ, ఎస్టీ,ఎస్సీ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధి నందికోళ్ల దేముడు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు పి. సూర్యప్రకాష్, కామాక వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
చోడవరంలో ర్యాలీ నిర్వహిస్తున్న
ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు
నర్సీపట్నంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు

కదం తొక్కిన ఉపాధ్యాయులు